రాష్ట్రవ్యాప్తంగా ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’పథకం ద్వారా 5548 కోట్ల రూపాయలను ప్రత్యక్షంగా లబ్ధిదారులకు అందిస్తున్నామని బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. విజయవాడలో కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజాతో కలిసి కాపు నేస్తం రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు.
చంద్రబాబు పాలనలో కులాల మధ్య చిచ్చుపెట్టి కాపులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. కాపు నేస్తం పథకం ద్వారా వెనుకబడిన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామని సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మోసగించారని దుయ్యబట్టారు. ఆచరణ సాధ్యం కాని హామీలను జగన్ ఇవ్వబోరని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు అనుగుణంగా కాపుల సంక్షేమం కోసం ఏడాదికి 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని జక్కంపూడి రాజా తెలిపారు.