'పవన్‌కల్యాణ్.. ఇది జగన్మోహన్ రెడ్డి అడ్డా..జాగ్రత్తగా ఉండాలి' జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. పవన్ పర్యటన సినిమా ప్రచారంగా ఉందని ఎద్దేవా చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. సీఎంగా జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోలేకపోయారన్నారు. సీఎం జగన్‌ను విమర్శించే స్థాయి లోకేశ్‌కు లేదని అన్నారు.
సినిమా జీవితంలోనే...
సినిమా జీవితంలోనే పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ అనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. డబ్బులు తీసుకుని మాట్లాడే పవన్... గత ఐదేళ్లు తెదేపాకు అనుకూలంగా పని చేశారని దుయ్యబట్టారు. 'చంద్రబాబు మాట - పవన్ నోట' అన్నట్లు ఆయన వ్యవహారం ఉందన్నారు. ఉద్యమిస్తాం, ముట్టడిస్తామంటూ సినిమా డైలాగ్‌లు చెప్పడం కాదని... ఇది జగన్మోహన్ రెడ్డి అడ్డా అనే విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
ఇదీ చదవండి
'వకీల్ సాబ్ వచ్చాడని మీ సీఎం సాబ్‌కు చెప్పండి'