ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె.. ప్రైవేట్​ ఏజెన్సీల ద్వారా చెత్త తొలగింపునకు చర్యలు

Minister Suresh review : రాష్ట్రంలోని మున్సిపల్‌ కమిషనర్లతో మంత్రి సురేష్‌ సమీక్ష నిర్వహించారు. ఎక్కడెక్కడ ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులు హాజరవుతున్నారని అడిగి తెలుసుకున్నారు. చెత్త పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న మంత్రి.. అవసరమైన చోట ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా చెత్త తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

Minister Suresh
Minister Suresh

By

Published : Jul 14, 2022, 5:43 PM IST

Updated : Jul 14, 2022, 7:09 PM IST

Municipal Workers Strike: పట్టణ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై ప్రభుత్వం మెట్టు దిగడం లేదు. కార్మికులు సమ్మె విరమిస్తేనే చర్చలని ఇప్పటికే తేల్చిచెప్పిన ప్రభుత్వం.. ప్రైవేట్ ఏజన్సీలను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కార్మికుల సమ్మెపై సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. మంత్రులు అప్పలరాజు, నాగార్జున, బొత్స సత్యనారాయణ, సురేష్, వేణుగోపాలకృష్ణ, బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల హాజరై.. కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై సీఎంతో మంత్రుల కమిటీ చర్చించే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని పురపాలిక సంఘాల కమిషనర్లతో మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. సమ్మె అనంతర పరిస్థితులపై మంత్రి సురేశ్ ఆరా తీశారు. సమ్మె నేపథ్యంలో చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలు, ఎక్కడెక్కడ ఎంతమంది పారిశుద్ధ్య నిర్వహణకు హాజరవుతున్నారని అడిగి తెలుసుకున్నారు. చెత్త పేరుకుపోకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మంత్రి సూచించారు. అవసరమైన చోట ప్రైవేట్ ఏజెన్సీ ల ద్వారా పనులు చేపట్టి చెత్తను తొలగించాలని ఆదేశించారు.

మరోవైపు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె నాల్గో రోజూ ఉద్ధృతంగా సాగింది. నంద్యాల్లో సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు, రాయదుర్గంలో కార్మికులు రోడ్డుపై భోజనాలు చేస్తూ నిరసన తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తమ బతుకులు రోడ్డున పడ్డాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం లోమున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది.. చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట నడిరోడ్డుపై సహ పంక్తి భోజనం చేశారు. ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని కార్మిక నేతలు హెచ్చరించారు.

నెల్లూరులో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. వీరికి జనసేన నేతలు మద్దతు తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్‌ అమలు చేయాలంటూ కార్మికులు నినదించారు. తాత్కాలిక సిబ్బందిని పర్మినెంట్‌ చేసి.. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగర పాలక సంస్థ మేయర్‌కు వినతిపత్రం ఇచ్చారు. బాపట్లలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట వంటా వార్పు చేశారు. అక్కడే సహపంక్తి భోజనాలు చేస్తూ నిరసన తెలిపారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ విశాఖలో నగరపాలక సంస్థ కార్మికులు డిమాండ్ చేశారు. సీఐటీయూ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన కార్మిక సంఘాలు సమ్మెను ఉద్ధృతం చేయాలని నిర్ణయించాయి. రేపు ముఖ్యమంత్రి విశాఖకు వాహన మిత్ర పథకం నిధులు అందించేందుకు వస్తున్నందున… నిరసన తెలపాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

Last Updated : Jul 14, 2022, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details