Srinivas goud: తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓ ఆలయ సందర్శనకు వెళ్లారు. హఠాత్తుగా ఓ బాలుడు వచ్చి ఆయన వేలు పట్టుకుని రోదించసాగాడు. అనూహ్య పరిణామంతో ఆయనకు వెంటనే ఏమీ అర్థం కాలేదు. బాలుడిని సముదాయించి.. ఏంటని ఆరాతీయగా.. ‘నన్ను చదివించండి సారూ’ అంటూ అతడు వేడుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపహాడ్ మైసమ్మ దేవాలయం వద్ద ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
హన్వాడ మండలానికి చెందిన మల్లెల వెంకటేశ్ నిరుపేద కుటుంబానికి చెందినవాడు. సొంతూళ్లో ఆస్తిపాస్తులు లేకపోవటంతో.. అత్తగారి ఊరైన కాకర్లపహాడ్‌కు వచ్చి భార్య బుజ్జమ్మ, ఇద్దరు పిల్లలతో చిన్న రేకుల గదిలో నివసిస్తున్నాడు. మైసమ్మ ఆలయం సమీపంలోని చెట్టు కింద చిన్న డబ్బాలో కూల్‌డ్రింక్స్, వాటర్‌బాటిల్స్ పెట్టుకుని విక్రయిస్తుంటాడు. వారంలో భక్తుల రద్దీ ఉండే మూడు రోజుల్లో మినహా వీరి వ్యాపారానికి గిరాకీ ఉండదు. అరకొర ఆదాయంతో నెట్టుకొస్తున్నాడు.
వారి పెద్ద కుమారుడు విజయ్‌కుమార్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి వరకు చదివాడు. ఇకపై చదివే స్థోమత లేక.. తల్లిదండ్రులకు సాయం చేస్తున్నాడు. ఆదివారం మైసమ్మ ఆలయ దర్శనానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దగ్గరకు విజయ్‌కుమార్ పరుగు తీశాడు. ఆయన చేయి పట్టుకుని.. తనను చదివించమని కన్నీళ్లతో వేడుకున్నాడు. మంత్రి అతడిని ఓదార్చారు. తల్లిదండ్రులను పిలిచి వివరాలు తెలుసుకున్నారు. చదువుకోవాలన్న బాలుడి తపన చూసి ఆయన చలించారు. వెంటనే అతని తన వాహనంలో మహబూబ్‌నగర్ తీసుకెళ్లి, ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. హాస్టల్ వసతి కల్పించి యూనిఫాం, పుస్తకాలు తదితరాలన్నీ ఇప్పించారు. బాలుడి చదువు పూర్తయి స్థిరపడేదాకా తాను అండగా ఉంటానని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.