సంక్రాంతి పండుగకు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు.. ఎన్నికలు వచ్చినప్పుడే కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రజల వద్దకు వస్తున్నారని తెలంగాణ మంత్రి సత్యవతి రాఠోడ్ ఎద్దేవా చేశారు. 'మానుకోట రాళ్ల చరిత్ర నీకు తెలుసా సంజయ్' అంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఆమె ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని చూస్తే ఆ మానుకోట రాళ్ల కిందనే భాజపాను సమాధి చేస్తామని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి, జిల్లా అభివృద్ధికి భాజపా ఏం చేసిందో చెప్పాలని సంజయ్‌ను ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని కేంద్రం అమలు చేయలేదని.. ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి.. ఇక్కడి కాళేశ్వరం ప్రాజెక్టుకు మొండిచేయి చూపిందని ఆరోపించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు.
కార్పొరేట్లకు అప్పగించేందుకే..
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే కాంగ్రెస్ ఉన్నప్పుడే భూసేకరణ చేసి ఇవ్వలేదని.. అందుకే ప్రాజెక్టు పోయిందని అధికారులు చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎప్పటి వరకు అధికారంలో ఉందనే కనీస పరిజ్ఞానం లేకుండా ఒక రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు. రైల్వే శాఖను ప్రైవేటు పరం చేసేందుకు ఈ వ్యాఖ్యలు సంకేతంగా కనపడుతున్నాయని విమర్శించారు.
పల్లాకు మొదటి ప్రాధాన్యత..
బయ్యారంలో కేంద్రం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని సత్యవతి అన్నారు. స్థానికంగా గిరిజన అభ్యర్థులు దొరకనట్లు డిగ్రీ కూడా లేని వ్యక్తిని పట్టభద్రుల నియోజకవర్గానికి అభ్యర్థిగా కాంగ్రెస్ నిలబెట్టిందని ఎద్దేవా చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి వరంగల్ జిల్లాకు చెందిన వాడని పేర్కొన్నారు. పల్లాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:నగర పోరు: ప్రచారంలో ప్రధాన పార్టీలు పోటాపోటీ