కొవిడ్‌తో మృతి చెందిన వారందరి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు స్పందించారు. పరిహార అంశం కేంద్రం, రాష్ట్రం రెండు కలిసి చేయాల్సిన కార్యక్రమాలని ఇవేవీ చూడకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యత లేకుండా మాట్లాడవచ్చా అని విమర్శించారు. సాధ్యాసాధ్యాలు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా చూడాలని అన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌తో అనేక మంది చనిపోయారని.. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో కరోనాకు చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి సామాన్యులు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం పొందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదైతేనే కరోనాతో చనిపోయారని తెలుస్తుందని.. అయితే కొద్ది మంది వైద్యం కోసం హైదరాబాద్, చెన్నై వెళ్లి అక్కడ మరణిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ ఆసుపత్రుల్లో 40 నుంచి 50శాతం మంది ఆంధ్రా నుంచి వెళ్లిన వారేనని.. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ఒకేసారి రూ.10 లక్షలు ఇవ్వాలంటే ఎలా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూడాలి కదా’ అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సామాజికవర్గాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ రఘురామకు పని లేక దిల్లీలో కూర్చొని, ఏదో రకంగా రోజూ పత్రికల్లో కనిపించాలని లేఖలు రాస్తున్నారని విమర్శించారు.