తల్లిదండ్రులు వృద్ధులు కాగానే పట్టించుకోని వాళ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నారని మంత్రి పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తన కార్యాలయంలో వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని మంత్రి ముఖాముఖిగా వారితో సంభాషించారు. వారి సమస్యలు తెలుసుకొని.. అక్కడికక్కడే పరిష్కారం చూపించారు.
తొలుత పెద్ద కరగ్రహారానికి చెందిన సి.హెచ్ దేవరాజ్ అనే యువకుడు.. తన తల్లితో వచ్చి మంత్రిని కలిశారు. తాను నందమూరు ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ రెండవ ఏడాది చదువుతుండగా తన తండ్రి అకస్మాత్తుగా చనిపోయాడని చెప్పారు. ఫలితంగా తన తల్లి ఒంటరిగా ఉంటుందని చదువును అర్దాంతరంగా మానేశానని మంత్రికి విన్నవించుకున్నాడు. ఏడాదికి 60 వేల రూపాయల చొప్పున మొత్తం 1 లక్షా 20 వేల రూపాయలను కాలేజీ యాజమాన్యానికి ఫీజుగా చెల్లించాలని దేవరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు స్పందించిన మంత్రి... తండ్రి చనిపోయాడని నిరాశతో కుంగిపోకుండా కసిగా ఎదగాలని, తల్లిని మరింత ప్రేమగా చూసుకోవాలని సూచించారు. కళాశాల యాజమాన్యంతో తాను మాట్లాడతానని చెప్పారు. చెల్లించనవసరం లేదని హామీనిచ్చారు.
స్థానిక నవీన్ మిట్టల్ కాలనీకి చెందిన గరికపాటి వెంకటేశ్వరరావు, రాఘవమ్మ దంపతులు మంత్రి వద్ద తమ సమస్యను చెప్పుకున్నారు. తన భార్య రాఘవమ్మ మధుమేహ వ్యాధిగ్రస్తురాలు అని... గాంగ్రీన్ కావడంతో ఆమె కాలి వేలుకు శస్త్ర చికిత్స చేసి ఇటీవల తొలగించారని చెప్పారు. ఆమెకు దయచేసి 5 వేల రూపాయల పింఛన్ ఇప్పించాలని వెంకటేశ్వరావు కోరారు. కిడ్నీ వ్యాధులతో బాధపడే వారికి రూ.10వేల పెన్షన్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ఒకే కేటగిరీ కిందకి తెచ్చి నెలకు రూ.5వేలు పెన్షన్ ప్రభుత్వం ఇస్తుందని పేర్కొన్న మంత్రి.. మంచంపై లేవలేని స్థితిలో ఉన్నవారికి మాత్రమే ఆ 5 వేల రూపాయల పింఛన్ వస్తుందని వారికి నచ్చజెప్పారు.