జూన్ 4న వైఎస్‌ఆర్ వాహన మిత్ర పథకం కింద లబ్ధిదారులకు రెండో ఏడాది ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి పేర్నినాని అన్నారు. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థికసాయం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గతేడాది ఆర్థిక సాయం పొందినవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయ సిబ్బంది సోషల్ ఆడిట్ చేసి అర్హులను నిర్ణయిస్తారని మంత్రి అన్నారు. కొత్తవాళ్లు గ్రామ సచివాలయంలో ఈనెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సీఎం నిర్ణయం తీసుకోవాలి
బస్సులు నడపడంపై సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి పేర్ని నాని చెప్పారు. రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌పై సీఎం చర్చిస్తున్నారన్న ఆయన...బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతిస్తే 24 గంటల్లో బస్సు సర్వీసులు మొదలవుతాయని వెల్లడించారు. ఆర్టీసీలో పొరుగు సేవల ఉద్యోగులను తొలగించట్లేదని మంత్రి పునరుద్ఘాటించారు.