అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడుందని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. గుగూల్ మ్యాప్‌లో గీత గీస్తే ఔటర్ రింగ్ రోడ్డు అయిపోతుందా? అని వ్యాఖ్యానించారు. కనీసం డీపీఆర్ కూడా తయారు చేయని ప్రాజెక్టుకు జగన్ సర్కార్ ఉరి వేసిందని ఎలా విమర్శిస్తారని అన్నారు. డీపీఆర్ లేని ఔటర్ రింగ్‌ను సీఎం జగన్ చేపట్టలేదని చెప్పడం దారుణమన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై 201 7 ఏప్రిల్‌లో ఫీజుబులిటీ రిపోర్టు ఇచ్చిన కేంద్రం.. భూ సేకరణ చేయవచ్చని చెప్పిందని.. 2017 నుంచి ఔటర్ రింగ్ రోడ్డును చంద్రబాబు ఎందుకు చేపట్టలేదో ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.
187కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని, ఓఆర్ ఆర్ ప్రాజెక్టును సీఎం జగన్ వదలి వేయలేదన్నారు. విజయవాడ మీదుగా జాతీయ రహదారులు వెళ్తుండటం వల్ల ప్రజలకు ట్రాపిక్ కష్టాలు పెరిగాయని, వీటిని తీర్చేందకు జగన్ సర్కారు చర్యలు తీసుకుందన్నారు. చిన అవుటపల్లి నుంచి కాజా టోల్ గేట్ వరకు బై పాస్ హైవే పనులు వేగంగా జరుగుతున్నాయని, మరోవైపు చిన అవుట్ పల్లి నుంచి - గన్నవరం -కంకిపాడు -మీదుగా కాజా వెళ్లే ప్రాజెక్టుకు చేపట్టి పూర్తి చేస్తామన్నారు. విజయవాడకు బైపాస్ ఉండాలని చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. చేనేత, టెక్ట్స్ టైల్ రంగంపై కేంద్రం జీఎస్టీని 5-12శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నామన్న మంత్రి... చేనేత రంగానికి నష్టం చేకూర్చే లా కేంద్రం నిర్ణయం ఉందన్నారు. జీఎస్టీ లేకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్ లో డిమాండ్ చేస్తుందన్నారు. జీఎస్టీ పై ఆందోళనకు వైకాపా సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందన్నారు.