ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అగ్రవర్ణ పేదలకు గుడ్​ న్యూస్... 'ఈబీసీ నేస్తం'కు కేబినెట్‌ ఆమోదం

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు వర్గాల మహిళలకు ఇస్తున్న చేయూత పథకాన్ని అగ్రవర్ణ పేదలకు సైతం ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన 3 గంటలపాటు జరిగిన భేటీలో కీలకమైన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రైవేటు లే అవుట్లలో 5 శాతం భూమిని పేదలకు కేటాయించేలా చట్ట సవరణకూ నిర్ణయించారు. కాకినాడ సెజ్‌లోని 2180 ఎకరాల భూమిని రైతులకు వెనక్కి ఇవ్వాలని తీర్మానించారు.

minister perni nani on ap cabinet meet
minister perni nani on ap cabinet meet

By

Published : Feb 23, 2021, 4:31 PM IST

Updated : Feb 24, 2021, 3:21 AM IST

గ్రవర్ణాల్లో పేద కుటుంబాలకు చెందిన 45-60 ఏళ్లలోపు మహిళలకు ఈబీసీ నేస్తం పథకం అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. వీరికి ఏడాదికి రూ.15వేల చొప్పున మూడేళ్లపాటు అందించనుంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది లబ్ధి పొందుతారని అంచనా.ఇందుకు ఏడాదికి రూ.670 కోట్ల చొప్పున మూడేళ్లలో రూ.2,011 కోట్లు ఖర్చవుతుంది. అవినీతి కేసుల్లో ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగుల కేసుల విచారణను 100 రోజుల్లో పూర్తిచేయాలని నిర్ణయించి, ఈ మేరకు చట్టసవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వాటిని విలేకర్లకు వివరించారు. విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగా ఉంచాలని.. ప్రైవేటీకరించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని కేంద్రాన్ని కోరుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రైతులను ఆదుకోడానికి రైతుభరోసా కేంద్రాల పరిధిలో రూ.2,719.11 కోట్లతో బహుళ సదుపాయాల కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

కాకినాడ సెజ్‌.. ఆరు గ్రామాలు ఖాళీ చేయక్కర్లేదు

కాకినాడ సెజ్‌కు భూములిచ్చేందుకు అంగీకరించకుండా పోరాడుతున్న రైతులకు వారి 2,180 ఎకరాలను తిరిగి ఇచ్చేయాలని తీర్మానించినట్లు మంత్రి నాని తెలిపారు. గతంలో సేకరించిన 657 ఎకరాల భూముల్లో పరిహారం తీసుకోనివారికి అదనంగా ఎకరాకు రూ.5లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ‘శ్రీరామపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటి¨వారిపాలెం, రావివారిపోడు, రామరాఘవపురం గ్రామాలను ఖాళీచేయక్కర్లేదు. కేసులను ఎత్తివేయాలి. సెజ్‌ నుంచి కాలుష్య కారకాలు బయటకు రాకూడదు. దివీస్‌ ల్యాబ్‌లోనూ అవశేషాలు బయటకు వదలకూడదు. సమీపంలోని హేచరీలు దెబ్బతినకుండా అన్ని చర్యలూ తీసుకోవాలి’ అని తీర్మానించినట్లు చెప్పారు.

చెత్త నుంచి సంపద

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, నగరాలు సూరత్‌తో పోటీపడేలా తయారుచేయాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. వచ్చే 3-6 నెలల్లోపు 2,700 వాహనాల ద్వారా చెత్త సేకరించాలి. ఎక్కడా గుంతలు ఉండకూడదు, మంచినీటి కొరత లేకుండా చేయాలి. ప్రతి ఇంటినుంచి మూడు రకాల (తడి, పొడి, ప్రమాదకర) చెత్తను సేకరించాలి. దీన్నుంచి సంపద సృష్టించేలా చర్యలుండాలి. దీనికి అవసరమైన నిధులివ్వాలని సీఎం ఆదేశించారు’ అని మంత్రి పేర్కొన్నారు.

ప్రైవేటు లేఔట్లలో పేదల కోసం 5% భూమి

కొత్తగా వేసే ప్రైవేటు లేఔట్లలో 5% భూమిని పేదలకు కేటాయించాలని తీర్మానించారు. సామాజిక అవసరాల నిమిత్తం వదిలే 10% భూమికి ఇది అదనం. ఏప్రిల్‌ నుంచి ఇది అమల్లోకి రానుంది.
*వైఎస్సార్‌ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టులో భాగంగా పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు ఇళ్లస్థలాలు ఇచ్చే కార్యక్రమానికి ఈ స్థలాన్ని కలెక్టర్లకు అప్పగించేలా నిర్ణయించారు. ప్రైవేటు లేఔట్లలో భూమి లేకపోతే.. మూడు కిలోమీటర్ల దూరం లోపల కొనుగోలు చేసి కలెక్టర్లకు అప్పగిస్తారు.

టిడ్కో కాలనీలకు.. వైఎస్‌ జగనన్న నగర్‌గా పేరు

టిడ్కో ఇళ్లకు దరఖాస్తు చేసుకుని.. జగనన్న ఇంటిస్థలం పథకంలో లబ్ధిపొందిన వారికి గతంలో వారు చెల్లించిన రూ.469 కోట్లను సొమ్మును వెనక్కి ఇస్తారు. 300 చదరపు అడుగుల అపార్టుమెంట్లకు దరఖాస్తు చేసుకున్న 1,43,600 మందికి రూపాయితో రిజిస్ట్రేషన్‌ చేసి అప్పగిస్తారు. 365 చదరపు అడుగుల వారికి రూ.25వేలు, 430 చదరపు అడుగుల వారికి రూ.50వేలు వెనక్కి ఇస్తారు. ఈ నిర్ణయాలతో ప్రభుత్వంపై రూ.5,579 కోట్ల భారం పడనుందని మంత్రి నాని వివరించారు. టిడ్కో కాలనీలకు వైఎస్‌ జగనన్ననగర్‌గా పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

స్టీలు ప్లాంటు నిర్మాణానికి వెంచర్‌ భాగస్వామిగా లిబర్టీ స్టీల్‌ ఇండియా

కడప జిల్లాలో స్టీలుప్లాంటు నిర్మాణానికి లిబర్టీ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ను సంయుక్త వెంచర్‌ భాగస్వామిగా ఎంపికచేసే ప్రక్రియకు ఆమోదం. ఒక్కో దశలో 30 లక్షల టన్నుల సామర్థ్యంతో నిర్మాణం. తొలిదశలో రూ.10,082 కోట్లు, రెండోదశలో రూ.6వేల కోట్ల వ్యయం. జమ్మలమడుగు మండలం పెద్దండ్లూరు, సున్నపురాళ్లపల్లెల్లో 3,148.68 ఎకరాల భూమి ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌కు కేటాయింపు, ఈ భూమిలో స్టీల్‌ప్లాంటు నిర్మాణం.
*కడప జిల్లా వల్లూరు మండలం అంబాపురంలోని 93.99 ఎకరాలు, సీకేదిన్నె మండలం కొప్పర్తిలో 598.59 ఎకరాలు మెగా ఇండస్ట్రియల్‌ పార్కుల నిమిత్తం ఏపీఐఐసీకి కేటాయింపు.
*ఆంధ్రప్రదేశ్‌ గేమింగ్‌ చట్టం-1974కు సవరణకు ఆమోదం.
*చిత్తూరు జిల్లా పెనుమూరు, కార్వేటినగరంలోని పీహెచ్‌సీలను 50 పడకల ఆసుపత్రులుగా మార్చాలని నిర్ణయం.
*కడప జిల్లా జమ్మలమడుగు మండలం ముద్దనూరు, చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జీడీ నెల్లూరు, పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలో అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు.
*తితిదే ఉద్యోగులకు ఇళ్లస్థలాల పంపిణీకి అనుమతి.

కేబినెట్​ నిర్ణయాలు

ఇదీ చదవండి: 'అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది'

Last Updated : Feb 24, 2021, 3:21 AM IST

ABOUT THE AUTHOR

...view details