ముఖ్యమంత్రి జగన్(cm jagan) అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశంలో.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోలుకు ఆమోదముద్ర సహా.. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల(laptops) పంపిణీకి పచ్చజెండా ఊపారు. 28 లక్షల ఇళ్ల నిర్మాణానికి భారీ ప్రచారం చేసేందుకు ఆమోదముద్ర వేశారు.
నూతన ఐటీ విధానానికి.. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో సమావేశమైన కేబినెట్.. టిడ్కో(tidco) ద్వారా 2 లక్షల 62 వేల 216 ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయల కల్పన కోసం.. 5 వేల 990 కోట్ల రూపాయల బ్యాంకు రుణహామీకి పచ్చజెండా ఊపింది. జగనన్న కాలనీల(jagananna colony) నిర్మాణంపై భారీ ప్రచార కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్ సెజ్‌కు ఎకరా 25 లక్షల చొప్పున 81 ఎకరాల భూమి కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. భూముల రీసర్వేలో పట్టాదారులకు ధ్రువపత్రాల జారీకి వీలుగా.. ఏపీ భూహక్కు చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మొబైల్ వెటర్నరీ అంబులెన్సులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు అంగీకారం తెలిపింది.