ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వచ్చే ఏప్రిల్ నుంచే విద్యుత్ నగదు బదిలీ అమలు - సీఎం జగన్ కేబినెట్ మీటింగ్ న్యూస్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆన్‌లైన్ రమ్మీ నిషేధం, రైతులకు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం అమలుతో పాటు పలు అంశాలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. అలాగే బాపట్ల, మార్కాపురంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం స్థల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. ఉచిత విద్యుత్‌ పథకంలో మార్పులు చేసినా ఒక్క రైతుకూ నష్టం లేకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

minister perni nani about cabinet decisions
minister perni nani about cabinet decisions

By

Published : Sep 3, 2020, 3:24 PM IST

Updated : Sep 4, 2020, 6:18 AM IST

రైతులకు ఉచిత విద్యుత్తు పథకం కింద నగదు బదిలీ చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న 18 లక్షల ఉచిత విద్యుత్తు కనెక్షన్లతో పాటు మరో లక్ష అనధికార కనెక్షన్లను క్రమబద్ధీకరించి వాటినీ ఈ పరిధిలోకి తీసుకురానున్నారు. తొలుత శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని.. 2021 ఏప్రిల్‌ నుంచి రాష్ట్రమంతా అమల్లోకి తీసుకొస్తామని సమాచారశాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. మంత్రి మండలి నిర్ణయాలను గురువారం మధ్యాహ్నం ఆయన విలేకరులకు వెల్లడించారు. స్మార్టు మీటర్లను విద్యుత్తు కంపెనీలే ఏర్పాటు చేస్తాయని, రైతులపై భారం ఉండబోదని చెప్పారు. కౌలు రైతులకూ ఇది వర్తిస్తుందన్నారు. ఉచిత విద్యుత్తును వ్యతిరేకించిన వ్యక్తులు.. ఇప్పుడు ఈ విషయాన్ని విమర్శించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం రూ.20వేల కోట్ల విద్యుత్తు బకాయిలు పెట్టి వెళ్లిపోతే అందులో రూ.14వేల కోట్లను తమ సర్కారు తీర్చిందని చెప్పారు. అందులో ఉచిత విద్యుత్తుకే రూ.7,177 కోట్లు చెల్లించాల్సి ఉందని, డిస్కంలు, ప్రభుత్వం, రైతుల మధ్య ఎస్క్రో ఖాతాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం చెల్లించిన నిధులు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా రైతులకు, విద్యుత్తు సంస్థలకు అందించే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఉచిత విద్యుత్తు భారం కాకుండా ఉండేందుకు 10వేల మెగావాట్ల సోలార్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మంత్రి మండలి నిర్ణయాలు మరికొన్ని..
వరికపూడిశిల ఎత్తిపోతలసర్వే, డీపీఆర్‌ ఆమోదం. రూ.1,273 కోట్లతో నిర్మాణం.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రెండోదశ పనులకు సూత్రప్రాయంగా ఆమోదం. రూ.15,389.80 కోట్ల అంచనా వ్యయం, 63.2 టీఎంసీల నీటి వినియోగంతో 8లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు.
* 51 మంది ఎంపీడీవోలకు డీడీవోలుగా పదోన్నతి కల్పించేందుకు తీసుకున్న నిర్ణయానికి ఆర్థికశాఖ ఆమోదం ఇచ్చిన తర్వాత మళ్లీ మంత్రిమండలి ఆమోదం.
* రాయలసీమ కరవు నివారణ పథకంలో భాగంగా 14 రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి పాలనామోదం.
* ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలో ప్రభుత్వ వైద్య కళాశాలకు 41.97 ఎకరాలు, గుంటూరు జిల్లా బాపట్ల మండలం మూలపాలెంలో ప్రభుత్వ వైద్య కళాశాలకు 51.07 ఎకరాల కేటాయింపులకు ఆమోదం.
* మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలపై మరో ఏడాదిపాటు నిషేధం.
* పశ్చిమగోదావరిలో ఫిషరీస్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు వీలుగా ఆర్డినెన్సుకు ఆమోదం. రానున్న అయిదేళ్లలో ఈ యూనివర్సిటీ కోసం రూ.300 కోట్ల వ్యయం.

విలేకరులు, మంత్రి మధ్య సంవాదం

విలేకర్లు: ప్రత్యేక హోదాపై మీరు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు?
మంత్రి పేర్ని నాని: కేంద్ర ప్రభుత్వానికి భారీ మెజారిటీ వచ్చినందున ఆ విషయంలో ఇప్పుడేమీ చేయలేమని జగన్‌ ముందే చెప్పారు.
విలేకర్లు: అప్పట్లో చంద్రబాబు నిలదీయలేదని ప్రశ్నించారు.. అప్పుడూ అదే పరిస్థితి కదా!
మంత్రి: అప్పట్లో తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వంలో భాగం. అందుకే ప్రశ్నించాం. మోదీ గల్లా పట్టుకుని అడగాలని మేమెప్పుడూ అనలేదు. అసలు ఒక సీఎం ప్రధాని గల్లా పట్టుకోగలరా?
విలేకర్లు: ప్రతిపక్షంలో ఉండగా ఉచిత విద్యుత్తుకు మీటర్ల ఏర్పాటును మీరు వ్యతిరేకించారు కదా?
మంత్రి: విద్యుత్తు సంస్కరణల్లో ఇదొక భాగం. విలేకర్లు: ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు నిబంధనలు, జీఎస్టీ వాటాకు సంబంధించి మీరు ఎందుకు సమ్మతి తెలియజేశారు?
మంత్రి: మేం వ్యతిరేకించడం లేదని ఎందుకు అనుకుంటున్నారు? మాకు భాజపా, తెదేపా, జనసేన, కేఏపాల్‌ సహా అందరూ ఉమ్మడిశత్రువులే.

ఆన్‌లైన్‌ జూదంపై నిషేధం

ఆంధ్రప్రదేశ్‌లో రమ్మీ, పోకర్‌ వంటి ఆన్‌లైన్‌ జూదాన్ని నిషేధిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ జూదం నిర్వహిస్తూ మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా వేస్తారు. ఆన్‌లైన్‌ జూదం ఆడిన వారికి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు.

ప్రకాశం దిగువన 2బ్యారేజీలు

ప్రకాశం బ్యారేజీ దిగువన మరో రెండు బ్యారేజీల నిర్మాణానికి ఆమోదం. చోడవరం వద్ద రూ.1,215 కోట్లతో 3 టీఎంసీల నిల్వకు వీలుగా ఒకటి, హంసలదీవిపైన బండికోళ్లంక, తూర్పుపాలెం మధ్య రూ.1350 కోట్లతో మరో బ్యారేజీ నిర్మించనున్నారు.

‘నిధుల కార్పొరేషన్‌’కు ఓకే

థకాలకు నిధుల సమీకరణ కోసం ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం. మనబడి నాడు- నేడు, వైద్యం నాడు- నేడు, చేయూత, ఆసరా, రైతుభరోసా, అమ్మఒడి వంటి ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలకు నిధులను ఈ కార్పొరేషన్‌ సమీకరిస్తుంది.

ఇదీ చదవండి:విద్యుత్ నగదు బదిలీ పథకం శ్రీకాకుళం నుంచి ప్రారంభం

Last Updated : Sep 4, 2020, 6:18 AM IST

ABOUT THE AUTHOR

...view details