ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులు కరోనాతో చనిపోతే రూ.10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. కరోనా బారినపడి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగికి నెల జీతం అడ్వాన్స్‌గా చెల్లిస్తామన్నారు. నాలుగు జిల్లాల ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లతో మంత్రి పెద్దిరెడ్డి వెబ్ఎక్స్ సమావేశం నిర్వహించారు.
కిందటి సంవత్సరం ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు సాధించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో అంతకుమించి ఫలితాలు సాధించాలని మంత్రి పెద్దిరెడ్డి ఉపాధి హామి సిబ్బందికి సూచించారు. కూలీలకు ఎక్కువ పనిదినాలను కల్పిస్తే దాని ద్వారా మెటీరీయల్ వాటా ఎక్కువ సాధించగలుగుతామని వివరించారు. వాటితో గ్రామీణ మౌలిక సదుపాయాలు నిర్మించుకోవచ్చని అన్నారు. జూన్ నెలాఖరుకు 16 కోట్ల పని దినాలను పూర్తి చేస్తే, కేంద్రాన్ని అదనంగా ఆడగవచ్చని వ్యాఖ్యానించారు.