గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి రేపట్నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు పకడ్బందీగా జరిగేలా జిల్లా కలెక్టర్లు బాధ్యత వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
వారిని భాగస్వాములు చేయండి
ఈసారి మొత్తం 16,208 ఖాళీలకు గానూ 10,63,168 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని, సుమారు 4,56,997 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం వారం రోజులపాటు పరీక్షల నిర్వహణ ఉంటుందని మంత్రి అన్నారు. జిల్లా కలెక్టర్లు పరీక్షల కోసం జాయింట్ కలెక్టర్లు, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, విద్యాశాఖ, పోలీస్ శాఖలతో పాటు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఈ ప్రక్రియలో భాగస్వాములు చేయాలని సూచించారు. కొవిడ్ వల్ల ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
అందుబాటులో మెడికల్ బృందాలు
పరీక్షలు రాసే అభ్యర్థుల మధ్య భౌతికదూరం తప్పనిసరిగా ఉండాలన్నారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో కొవిడ్ పాజిటివ్, అనుమానిత లక్షణాలు ఉంటే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో భాగస్వాములయ్యే సిబ్బందిలో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వారి స్థానంలో వేరే వారికి బాధ్యతలు అప్పగించేలా ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు అందుబాటులో అత్యవసర మెడికల్ బృందాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
మాస్క్ తప్పనిసరి
అన్ని పరీక్షా కేంద్రాలను ముందుగానే డిసిన్ఫెక్షన్ స్ప్రేతో శుభ్రం చేయాలని మంత్రి సూచించారు. ప్రతి అభ్యర్థి కచ్చితంగా మాస్క్ ధరించాలని, పరీక్షా కేంద్రాల వద్ద శానిటైజర్లను, ధర్మల్ స్కానింగ్‌ను అందుబాటులో ఉంచాలని అన్నారు. ప్రతి జిల్లాలో రెండు నుంచి మూడు క్లస్టర్‌లను గురించి, వాటిలోనే మొత్తం పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని పెద్దిరెడ్డి కోరారు. ప్రధానంగా జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్యమైన అర్బన్ ప్రాంతాల్లో ఈ పరీక్షా కేంద్రాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్లతో సంప్రదించి రవాణా సదుపాయం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి :విశాఖను రౌడీ దందాలకు అడ్డాగా మార్చారు: చంద్రబాబు