కుల, మత, పార్టీలకు అతీతంగా సీఎం జగన్ పాలన కొనసాగుతోందని.. దాని ఫలితంగానే కుప్పం మున్సిపాలిటీలో వైకాపాకు ఘన విజయం దక్కిందని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(minister peddireddy on kuppam election results) అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా జగన్ పాలన ఉండటంతోనే ఇది సాధ్యమైందని అమరావతిలో పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తెదేపా దౌర్జన్యకాండను అడ్డుకునేందుకే కుప్పం ప్రజలు వైకాపాను గెలిపించారన్నారు. కుప్పం నియోజకవర్గంలో సర్పంచ్, మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో తెదేపాను ప్రజలు తిరస్కరించారన్నారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తారని తాము అనుకోవట్లేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాక ఓట్ల కోసం డబ్బులు పంచాల్సిన అవసరం తమకు లేదన్నారు. దొంగ ఓట్లు వేశారంటున్న తెదేపా ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ.. ఏ పోలింగ్ బూత్‌లో అయినా దొంగ ఓట్లు వేశారంటూ తెదేపా ఏజెంట్లు అడ్డుకున్నారా? అని ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గంలో తనపై చంద్రబాబు పోటీ చేస్తే ఆహ్వానిస్తానని పెద్దిరెడ్డి చెప్పారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా విజయంపై సీఎం జగన్.. మంత్రి పెద్దిరెడ్డితో పాటు జిల్లా నేతలను అభినందించారు.
97 మార్కులు వేశారు: మంత్రి బొత్స
'సంక్షేమం, అభివృద్ధికి ప్రజలిచ్చిన తీర్పు ఇది. మా ప్రభుత్వానికి ప్రజలు 97 శాతం మార్కులు వేశారు. రాష్ట్రంలో 97-98 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. జగన్ సారథ్యంలోనే అభివృద్ధి, సంక్షేమమని ప్రజల భావన. పార్టీకి ఒకట్రెండు చోట్ల ఇబ్బందులు తలెత్తాయి.. సమీక్షించుకుంటాం' - మంత్రి బొత్స సత్యనారాయణ
కుప్పానికి స్వాతంత్య్రం వచ్చింది: ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి
పాదయాత్రలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీల అమలుతో కుప్పం ప్రజలు వైకాపాను గెలిపించాయని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. కుప్పం ప్రజలకు ఇప్పుడు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు ముందే కుప్పం ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. కుప్పంలో చంద్రబాబు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి ప్రధాన కారణం దొంగ ఓట్లేనంటూ విమర్శించారు. కుప్పంలో ఒక్కో వార్డులో 500 దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు దొంగ ఓట్లు వేయడానికి భయపడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు నిజంగా మానవత్వం ఉంటే కుప్పం నుంచి పక్కకు తప్పు కోవాలని సూచించారు. ఇకనైనా చంద్రబాబు వాస్తవాలను తెలుసుకొని నడవాలన్నారు. చంద్రబాబు లాంటి నేషనల్ లీడర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నించారు. లోకేశ్ మంచి, చెడు, చిన్నా పెద్దా తేడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ను తిట్టనిదే చంద్రబాబుకు నిద్ర పట్టదని నారాయణస్వామి ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి:
బాధ్యతల నుంచి పారిపోయేలా జగన్ విధానాలు: యనమల