వర్షాకాలం మొదలైన నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది లేకుండా ఇసుకను అందించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇసుక సరఫరా వ్యవహారాలను పర్యవేక్షించే కమిటీ సభ్యులు, మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలతో కలిసి తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక పాలసీని మరింత పటిష్టం చేసే అంశంపై ఉన్నతాధికారులతో కలిసి చర్చించారు.
వినియోగదారులకు అత్యంత పారదర్శకంగా ఇసుకను చేరువ చేసేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. గ్రామ,వార్డు సచివాలయాల నుంచే ఇసుకను బుకింగ్ చేసుకోవడానికి సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నాడు-నేడు, ఉపాధి హామీ పనుల కోసం ఎక్కడా ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.