పంచాయతీరాజ్ చట్టంలో చేసే సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. స్థానికులే ఎన్నికల్లో పాల్గొనేలా చట్టంలో మార్పులు చేశామన్నారు. స్థానికేతరులు పోటీచేస్తే స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతాయని అభిప్రాయపడ్డారు. ధనం, మద్యం ప్రాబల్యం తగ్గించేందుకు చట్టంలో మార్పులు తెచ్చామని మంత్రి వివరించారు. ఎన్నికల వేళ బెదిరింపులకు పాల్పడితే జరిమానా, జైలుశిక్ష విధింపు వంటి అంశాలు సవరణల్లో ఉన్నట్లు పెద్దిరెడ్డి చెప్పారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు - స్థానిక ఎన్నికలపై పెద్దిరెడ్డి వార్తలు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బడ్జె్ట్ సమావేశాల తర్వాత ఏ క్షణమైనా పాలన విశాఖ నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకూ సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని చెప్పారు. సచివాలయంలో పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పరిపాలన వికేంద్రీకరణకు ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని... మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రికి ఎక్కడి నుంచైనా పాలన కొనసాగించే అవకాశముంటుందని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమయాన్నీ కుదించినట్లు మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. సీఎం నిర్ణయం మేరకే పంచాయతీ ఎన్నికల నిర్వహణలో మార్పులు చేసినట్లు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఈ మార్పులు సత్ఫలితాలు ఇస్తాయన్నారు. స్థానిక ఎన్నికలకు వైకాపా సిద్ధంగా ఉన్నట్లు పెద్దిరెడ్డి పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందన్న రామచంద్రారెడ్డి... స్థానిక సంస్థల ఎన్నికల్లో 90శాతానికి పైగా స్థానాలను గెలుచుకుంటామని దీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి :ఇక అన్నీ ఎన్నికలే... సిద్ధంగా ఉండండి: సీఎం