గతంలో ఏ ప్రభుత్వమూ ఆదుకోని రీతిలో వైకాపా ప్రభుత్వం అన్నదాతలకు ఆసరాగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. తాడేపల్లి నుంచి సీఎం జగన్ వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పథకాన్ని ప్రారంభించగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి తిరుపతి ఆర్డీవో కార్యాలయం నుంచి దృశ్యమాద్యమం ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లావ్యాప్తంగా దాదాపు 21 వేల మందికి 12 కోట్ల 69 లక్షల రూపాయల బీమా సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి నారాయణస్వామి తెలిపారు. నివర్ తుపాన్‌తో జిల్లాలో 25 వేల ఎకరాలలో పంట నష్టపోయినట్లు అంచనా వేశామని వెల్లడించారు. ఈ నెల చివరి నాటికి రైతులకు నష్టపరిహారం అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. రాయితీపై విత్తనాలు రైతులకు అందజేస్తున్నామని చెప్పారు.