రాష్ట్రంలోని సినిమా హాళ్లలో త్వరలో ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వమే టికెట్ల విక్రయాన్ని చేపట్టనున్నట్లు సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, పలువురు నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యాజమాన్యాలతో సచివాలయంలో మంత్రి నాని సోమవారం సమావేశమయ్యారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన భేటీలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై లోతుగా చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రముఖ నటుడు చిరంజీవి ప్రతిపాదించిన డిమాండ్లపైనా చర్చించారు. పండుగ సమయంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతున్నారు కదా? మేం పెంచితే తప్పేంటని ఓ థియేటర్ యజమాని ప్రశ్నించారు. టికెట్ ధరలు పెంచకపోతే థియేటర్లను ప్రభుత్వానికే అప్పగించాల్సి వస్తోందని వాపోయారు. మంత్రి బదులిస్తూ.. ఆర్టీసీ ఉన్నందునే ప్రైవేటు సర్వీసులు పండుగ వేళల్లో భారీగా ఛార్జీలు పెంచడం లేదన్న సంగతి గుర్తించాలన్నారు. నెల్లూరు జిల్లాలోని ఒక నగర పంచాయతీలో ఆసియాలోనే నంబర్ వన్‌గా మల్టిప్లెక్స్ థియేటర్ కట్టానని, ప్రస్తుత జీవో ప్రకారం నగర పంచాయతీ స్లాబు ప్రకారం టికెటు ధర వసూలు చేయాలంటే ఎలా సాధ్యమని ఓ నిర్మాత ప్రశ్నించినట్లు తెలిసింది. నిర్మాతలు దిల్ రాజు, ఆదిశేషగిరిరావు, సి.కల్యాణ్, డీఎన్‌వీ దానయ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం మంత్రి, నిర్మాతలు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు.
పారదర్శకంగా టికెట్ల ధరలు: మంత్రి నాని
‘సినిమాలపై ఉన్న ఆపేక్షని ఎందుకు సొమ్ము చేసుకుంటున్నారని ప్రేక్షకులు ఎవరినీ ప్రశ్నించడానికి వీల్లేని రీతిలో పారదర్శకతతో టికెట్ ధరలు నిర్ణయిస్తాం. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తెలియజేస్తాం. ఈ విధానానికి సినీ ప్రముఖుల ఆమోదం లభించడం హర్షణీయం. ఆన్‌లైన్ టికెటింగ్‌పై 2002లోనే కేంద్రం నిర్ణయించినా నేటికీ సంపూర్ణంగా అమలు కాలేదు. సినీ వర్గాలతో సమావేశాల్లో వారి అభిప్రాయాలు తెలుసుకున్నాం. షూటింగ్ మొదలు విడుదల వరకు అన్ని అంశాలూ చర్చకు వచ్చాయి. ఆన్‌లైన్ టికెటింగ్‌పై భవిష్యత్తులో మరిన్ని సూచనలు చేస్తామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు చెప్పారు. ప్రభుత్వ ఆలోచన మేరకు పరిష్కారానికి వీలున్న అన్నింటిపైనా సానుకూలంగా స్పందిస్తాం. పేద, మధ్య తరగతి వర్గాలకు వినోదం అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. సినీ పరిశ్రమకు సంబంధించి పెండింగ్ జీవోలను త్వరగా విడుదల చేయాలన్న చిరంజీవి విన్నపం సహా.. ప్రజలకు ఇబ్బంది లేని ఏ కోరిక ఎవరు కోరినా ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుంది. చిరంజీవి అంటే సీఎం జగన్‌కు సోదరభావం ఉంది.
మేమే అడిగాం: సి.కల్యాణ్