పార్టీ విధానాలను ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు ప్రాణహాని ఉంటే.... ముందు రాష్ట్ర హోంశాఖను సంప్రదించాల్సిందని అన్నారు. పార్టీలో ఏ ఒక్కరికైనా సమస్య ఉంటే... సీఎం పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటారని చెప్పారు. పార్టీ అధినాయకత్వం ప్రతి కార్యకర్తను కాపాడుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. జగన్ నాయకత్వంలో ఎన్నికైన ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలతో పార్టీకి ఏమైనా నష్టం కలిగే పరిస్థితులు ఏర్పడితే అధినాయకత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కుల ప్రస్తావన చేయడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం అన్న మంత్రి మోపిదేవి...వాటిని పార్టీకి అంటగట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రానికి హోదా, రైల్వే జోన్, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెప్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని మంత్రి అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కేంద్రం నుంచి సహకారం కోరాతమని తెలిపారు. రాజధాని రైతుల కౌలు సమస్యను త్వరలోనే పరిష్కారిస్తామని వివరించారు.