సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 31 నిమిషాలు కారు పార్కింగ్ చేసినందుకు తన నుంచి భారీగా ఫీజు వసూలు చేశారని ఓ వ్యక్తి ఆరోపించారు. 31 నిమిషాల పార్కింగ్‌కు రూ. 500 పార్కింగ్ ఫీజు వసూలు చేశారని మండిపడ్డారు. ఇంత భారీగా పార్కింగ్ ఫీజు వసూలు చేయడంతో బ్రిగేడియర్ జైరత్ అనే ప్రయాణికుడు తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ఇక రైల్వే శాఖను ప్రైవేటీకరణ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటుందో ఈ సంఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్.. ఇది నిజంగా దారుణం అని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించాలని ఆయనకు రీ ట్వీట్ చేశారు. పౌరులు ఎదుర్కొంటున్న ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.