హైదరాబాద్‌లో సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ పిచ్చిగా మాట్లాడుతున్నారని తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ఆరోపించారు. పూల బొకే లాంటి హైదరాబాద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని... పచ్చగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. నాలుగు ఓట్ల కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఇదే మొదటి సారి చూస్తున్నానని కేటీఆర్ ధ్వజమెత్తారు. భాజపా పెద్దమనిషి స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్రశాంతతను చెడ గొట్టేందుకు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎవరేం మాట్లాడుతున్నారో ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు. అందరి హైదరాబాద్‌ను కొందరి హైదరాబాద్‌గా మార్చే ప్రయత్నాన్ని వ్యతిరేకిద్దామని ఆయన కోరారు.
తెరాసతోనే అభివృద్ధి సాధ్యం
తెలంగాణ భవన్లో సమావేశమైన 37 బీసీ సంఘాలు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు మద్దతు ప్రకటించాయి. బీసీ సంఘాలు తెరాసకు మద్దతునివ్వడం శుభ పరిణామమని కేటీఆర్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిచ్చిందని తెలిపారు. బీసీల సమస్యల పరిష్కారం తెరాస ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కులాలకు అతీతంగా పేదలు అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని వెల్లడించారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ఎంబీసీకి ఇచ్చామని.. రానున్న శాసన మండలి స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని సీఎం ఇప్పటికే చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. కుల వృత్తుల పరిరక్షణకు అనేక చర్యలు చేపట్టామని.. సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామని ఆయన తెలిపారు. ఎంబీసీలకు టికెట్లు ఇచ్చామని.. భవిష్యత్తులోనూ ఇస్తామన్నారు.
సమస్యలను పరిష్కరించే సీఎం
బీసీలు, ఎంబీసీల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. బీసీల సమస్యల పరిష్కారం పట్ల ఏ పార్టీకి చిత్తశుద్ధితో ఉందో ప్రజలందరికీ తెలుసునన్నారు.