టీమిండియా వాల్.. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. తాన అత్యంత అభిమానించే క్రికెటర్ అయిన ద్రవిడ్.. భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఎంపిక కావటం పట్ల.. మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తన ఆటతో సత్తా చాటిన ద్రవిడ్.. ఇప్పుడు తన సారథ్యంలో టీమిండియాను మరిన్ని ఉన్నత శిఖరాలకు చేర్చటంలోనూ కీలక పాత్ర పోషించనున్నాడని ఆకాంక్షించారు.
"నాకు ఎంతో ఇష్టమైన క్రికెటర్ ద్రవిడ్.. టీమిండియా కోచ్‌గా ఎంపికైనందుకు నా అభినందనలు. మీ సారథ్యంలో భారత సీనియర్ పురుషుల బృందం ఇంక ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను." - కేటీఆర్, మంత్రి
ఇప్పటికే మంచి కోచ్‌గా..
వివిధ జట్లకు కోచ్‌గా ద్రవిడ్(Rahul Dravid India Coach News) ఇప్పటికే సత్తాచాటాడు. 2014 నుంచి రెండేళ్ల పాటు ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. 2016లో అండర్-19, భారత్- ఏ జట్లకు కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న అతను.. యువ ఆటగాళ్లను సానబెట్టాడు. తన శిక్షణలో 2016 అండర్-19 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్.. 2018లో కప్పు అందుకుంది. ఆ సమయంలోనే సీనియర్ జట్టు కోచ్‌గా వ్యవహరించాలని బీసీసీఐ కోరినా.. యువ ఆటగాళ్ల కోసం సున్నితంగా తిరస్కరించాడు.