KTR Comments on BJP: తెలంగాణలో భాజపా సర్కస్ జరగబోతోందని.. రానున్న మూడు రోజులు ఇక్కడే దుకాణం పెడుతున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. ఏదో చేస్తామంటూ వస్తున్న భాజపా కేంద్ర నాయకులు... హైదరాబాద్ బిర్యానీ తిని.. ఇరానీ ఛాయ్ తాగి వెళ్తారని ఎద్దేవా చేశారు. భాజపా నేతలు టూరిస్టుల్లా వచ్చి లొల్లి పెట్టి వెళతారని.. వారికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి బై బై చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. భాజపా నాయకులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
భాజపా నేతలు హైదరాబాద్ వచ్చి కేసీఆర్ను, తెరాసను దూషిస్తే ఊరుకునేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెరాస ఓపికను అమసర్థతగా భావించవద్దని హెచ్చరించారు. అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతామని వస్తున్న భాజపా జాతీయ నేతలకు.. రాష్ట్ర ప్రజలు తెలంగాణ అభివృద్ధి అంటే ఏమిటో చూపాలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా, రైతు వేదికలు, హరితహారం కార్యక్రమంలో నాటిన చెట్లు, ఇంటింటి నల్లాలు, డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, కల్యాణ లక్ష్మి పథకాలను భాజపా నేతలకు ప్రజలు చూపాలన్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందో నిలదీయాలని సూచించారు.