Minister Karumuri Nageshwar rao: యాప్‌లో సాంకేతిక సమస్యలతో బియ్యానికి నగదు బదిలీ అంశాన్ని పక్కన పెట్టామని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. ప్రస్తుతం సర్వే నిలిచిందని, మళ్లీ మొదలైన తర్వాత దానిపై మాట్లాడతానని వివరించారు. ఎన్టీఆర్ జిల్లా సంయుక్త కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు, పౌరసరఫరాల సంస్థ డీఎంలతో శుక్రవారం విజయవాడలో నిర్వహించిన కార్యశాలలో మంత్రి పాల్గొన్నారు.
రేషన్ పంపిణీ, వాహనాల ద్వారా డెలివరీ, ధాన్యం సేకరణ తదితర అంశాలపై చర్చించారు. రబీలో కళ్లాల నుంచే ధాన్యాన్ని సేకరిస్తున్నామని, మద్దతు ధర అందించడంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామన్నారు. ధాన్యం తోలిన రైతుల ఖాతాల్లోనే రవాణా మొత్తాన్ని జమ చేస్తున్నామన్నారు. ఖాతా నంబర్లలో తేడాల కారణంగా రూ.15 కోట్లు ఇంకా ధాన్యం రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉందని మంత్రి వివరించారు.
పునరాలోచనలో ప్రభుత్వం?బియ్యమే కావాలని చెబుతున్న కార్డుదారులు..వార్డు వాలంటీర్లు ఇంటి ముందుకు రావడమే ఆలస్యం.. ‘డబ్బులొద్దు.. బియ్యమే తీసుకుంటాం’ అని కార్డుదారులు తెగేసి చెబుతున్నారు. ‘బియ్యానికి నగదు బదిలీ’ పథకంపై అయిష్టత చూపుతున్నారు. గురువారం నాటికి వచ్చిన సర్వే ఫలితాల ఆధారంగా చూస్తే.. అత్యధిక శాతం మంది బియ్యం తీసుకుంటామనే స్పష్టం చేస్తున్నారు.
కార్డుదారుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం కూడా దీనిపై పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. యాప్‌లో కొన్ని సవరణలు చేయాల్సి ఉందని, మళ్లీ ఎప్పుడు సర్వే మొదలయ్యేదీ తర్వాత చెబుతామని వాలంటీర్లకు సందేశం పంపారు.
బియ్యానికి నగదు బదిలీ పథకాన్ని గాజువాక, అనకాపల్లి, కాకినాడ, నరసాపురం, నంద్యాల(మొత్తం 5) పురపాలక సంఘాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- గాజువాకలో నిర్వహించిన సర్వేలో.. 90 శాతం పైగా కార్డుదారులు బియ్యమే కావాలని స్పష్టం చేశారు.
- అనకాపల్లిలో తొలి రెండు రోజుల సర్వేలోనూ నగదు బదిలీకి అంగీకరించిన వారి సంఖ్య నామమాత్రంగానే ఉంది.
- కాకినాడ నగరపాలక సంస్థలోనూ సగటున 90శాతం మందికి పైగా దీన్ని వ్యతిరేకించారు.
- నరసాపురం, నంద్యాలల్లోనూ ఎక్కువ మంది నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అంగీకరించిన వారు కూడా వాలంటీర్లు ఒకటికి నాలుగైదుసార్లు చెబుతున్నందువల్లే ‘సరే’ అంటున్నారు. గాజువాక, అనకాపల్లిల్లో సర్వేకు వెళ్తున్న వాలంటీర్లు.. ‘ఈ రెండు నెలలైనా డబ్బులు తీసుకోండి, తర్వాత బియ్యమే తీసుకుందురులే’ అని కార్డుదారులను ఒప్పించే యత్నం చేస్తున్నారు.
- పథకంపై ఇప్పటికే మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కావడంతో కార్డుదారుల్లో ఆలోచన మొదలైందని, ఇప్పుడు నగదు తీసుకుంటే మున్ముందు కార్డులు రద్దవుతాయని వారు ఆందోళన పడుతున్నారని పరిశీలకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసిన తర్వాతే.. ప్రభుత్వం ప్రస్తుతానికి నగదు బదిలీ వ్యవహారాన్ని పక్కన పెట్టిందని అంటున్నారు.
గురువారం సాయంత్రం నుంచి నిలిచిన సర్వే..బియ్యానికి నగదు బదిలీ పథకాన్ని తొలుత 5 పురపాలక సంఘాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్డుదారుల అంగీకారం తీసుకునేందుకు ఈ నెల 18 నుంచి 22 వరకు ఆయా మున్సిపాలిటీల్లో సర్వే చేయాలని వాలంటీర్లకు సూచించింది. కార్డుదారుల ఇళ్లకు వెళ్లి పథకం ఉద్దేశాన్ని వివరించాలని, నగదు తీసుకునేందుకు సరే అంటే, అంగీకారపత్రాలపై సంతకాలు తీసుకోవాలని సూచించింది.
దీనికోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించింది. అయితే తొలిరోజు సర్వే వాయిదా వేయాలని అధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయి. 19, 20 తేదీల్లో సర్వే సాగింది. 21వ తేదీ సాయంత్రం నుంచి యాప్ సేవలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి:
రేషన్ బియ్యానికి బదులు నగదు...నూరుశాతం వ్యతిరేకిస్తున్న కార్డుదారులు