మంగళవారం తలపెట్టిన భారత్ బంద్‌లో ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావివ్వకూడదని మంత్రి కన్నబాబు అన్నారు. దేశవ్యాప్త బంద్ ను మధ్యాహ్నం ఒంటి గంటలోగా ముగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రైతుల మనోభావాలను గౌరవిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత తెరవాలని కోరారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆర్టీసీ బస్సులు నడపవద్దని సూచించారు. రేపు విద్యాసంస్థలు కూడా మూసివేయాలన్న ఆయన.. బంద్ ప్రశాంతంగా జరిగేలా రైతుసంఘాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అందుకే మద్దతిచ్చాం...
కనీస మద్దతు ధర విషయంలో రైతులకు తగిన పరిష్కారం త్వరలో లభిస్తుందని ఆశిస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. రైతుల ప్రయోజనాలకు ఎటువంటి విఘాతం కలగదని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని..అందువల్లే వ్యవసాయ బిల్లులకు షరతులతో కూడిన మద్దతు పలికామన్నారు. కానీ... చంద్రబాబు మరో యూటర్న్ తీసుకున్నారని ఆక్షేపించారు. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు రేపు విజ్ఞాపనలు ఇవ్వాల్సిందిగా నిర్ణయించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.
ఇదీ చదవండి
మత్స్య ఎగుమతుల్లో దేశం తొలి స్థానానికి చేరాలి: ఉపరాష్ట్రపతి