వ్యవసాయాన్ని కేవలం జీవనాధారంగానే కాకుండా.. ఎగుమతులకు అవకాశం ఉండేలా ప్రణాళికలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. అమరావతిలో మాట్లాడిన ఆయన.. వ్యవసాయ, పరిశ్రమల శాఖల సమన్వయంతో ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. రెండు శాఖల అధికారులతో ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఈ ఆలోచనపై ఓ కార్యశాల ఏర్పాటుచేయనున్నామని స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల క్లస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని కన్నబాబు చెప్పారు. వ్యవసాయ వ్యర్థాలతో వివిధ ఉత్పత్తులు తయారీపై దృష్టి సారించామని అన్నారు.
అనంత ఉద్యాన ఉత్పత్తుల హబ్
అనంతపురం జిల్లాను ఉద్యానవన ఉత్పత్తుల హబ్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ క్లస్టర్లు ఏర్పాటుపై సంయుక్త టాస్క్‌ఫోర్స్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. లాజిస్టిక్ చైన్ కూడా అభివృద్ధి చేయాల్సి ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. త్వరగా పాడయ్యే కూరగాయలు, పువ్వులు, ఇతర ఉత్పత్తులు త్వరితగతిన ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.