ఆగస్టు నుంచి సెప్టెంబర్ చివరి వరకు రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. రెండు నెలల్లోనే వర్షాల వల్ల తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో 1.15లక్షల ఎకరాలు వ్యవసాయ పంటలు, 23511 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని మంత్రి తెలిపారు. భారీ వర్షాల వల్ల 3వేల కిలోమీటర్లు రోడ్లు దెబ్బతిన్నాయని, 65 మైనర్ ఇరిగేషన్ సోర్సులు, పంచాయతీరాజ్, మున్సిపల్ విభాగాల్లో రోడ్లు, భవనాలు దెబ్బతిన్నాయని వివరించారు.
ప్రస్తుతం కురుస్తోన్న వర్షాల వల్ల జరిగిన పంటనష్టంపై ఇంకా ఎన్యుమరేషన్ జరుగుతోందని మంత్రి కన్నబాబు చెప్పారు. నష్టాల నివేదిక ప్రభుత్వానికి చేరిందని.. పరిహారం, సహాయంపై సీఎం జగన్ సమీక్షించారని వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల వారిని ఆదుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. పంట నష్టం జరగలేదని చంద్రబాబు విమర్శించడం సరికాదని హితవు పలికారు.