1969 తెలంగాణ ఉద్యమం అణగారిపోయిన తరవాత ఎప్పటికైనా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించగల మరో నాయకుడు ఉద్భవించగలడా అని ఆశగా ఎదురు చూశారు.
ఆ నమ్మకం వమ్ము కాలేదు. గులాబీ జెండాను చేత పూనిన ఒక ధీరోదాత్తుడు ఆవిర్భవించి తెలంగాణను విముక్తం చేశాడు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ జనం కలలోను, మెలకువలోను జపిస్తున్న మూడక్షరాల పేరు- కేసీఆర్!
స్వప్నం సాకారం!
అందరూ చరిత్ర నుంచి ప్రభావితమవుతారు. కొందరే చరిత్రను ప్రభావితం చేస్తారు. తెలంగాణ సమాజాన్ని ఊగించి, ఉరికించి, దీవించి, శాసించి విజయతీరం చేర్చారు కేసీఆర్. ఆయన ఉన్నత వ్యక్తిత్వం ముందు, ఆయన ఉక్కు సంకల్పం ముందు, ఆయన వ్యూహ చతురత ముందు- ఆ విధి సైతం తలవంచింది. తెలంగాణ ఆవిర్భవించింది గులాబీ జెండా సంపన్న వర్గాలు, కులాల అధికార వాంఛలో పుట్టలేదు. వెనకబడిన తెలంగాణ వేదనలో పుట్టింది. అచంచల దీక్షతో సిద్ధాంత బలంతో ముందుకు ఉరికింది.
సుశిక్షితులైన కార్యకర్తలే పునాదిగా పురోగమించింది. ధనబలం ఉన్న పార్టీలను జనబలంతో ఎదిరించింది. మఘలో పుట్టి పుబ్బలో పోతుందని అవహేళన చేసిన పార్టీలను అదృశ్యం చేసింది. స్వరాష్ట్ర స్వప్నం సాకారం చేసింది. ఇది చరిత్రకందని అద్భుతం.
డిప్యూటీ స్పీకర్ పదవి మొదలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, రాష్ట్ర మంత్రి, కేంద్రమంత్రి వంటి పదవులను ప్రజల ఆకాంక్ష కోసం తృణప్రాయంగా వదిలిన ఘన చరిత్ర తెరాస సొంతం. ఆ త్యాగమే పార్టీని ప్రజలకు దగ్గర చేసింది. భావజాల ప్రచారం, ఉద్యమ కార్యాచరణ, రాజకీయ సమరం అనే మూడు కోణాల్లో కేసీఆర్ పార్టీని నడిపించిన తీరు అనితర సాధ్యం.
టీఆర్‌ఎస్ ప్రస్థానం ప్రారంభమైన రోజున దేశంలో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకం. పద్నాలుగేళ్ల పోరాటం తరవాత దాదాపు అన్ని పార్టీలు అనుకూలం. వ్యవస్థలేవైనా తెలంగాణకు అనుకూలంగా మారవలసిన అనివార్యతను సృష్టించిన రాజకీయ యోధుడు కేసీఆర్.
ఈ ప్రయత్నంలో ఆయనకు ఆచార్య జయశంకర్ తోడుగా నిలిచారు. తెలంగాణ ఏర్పాటును వాయిదా వేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరి ఒకవైపు, ఉద్యమాన్ని దెబ్బతీయాలనే తెలుగుదేశం ఇంకోవైపు. ఈ రెండింటిని మట్టి కరిపించి టీఆర్‌ఎస్ అజేయంగా నిలిచింది. అడుగడుగునా అడ్డుపడే సైంధవులను ఓడిస్తూ, కేసీఆర్ ఉద్యమాన్ని విజయతీరం చేర్చారు.
విజయాన్ని అందరూ సొంతం చేసుకుంటారు. అపజయం ఎప్పుడూ అనాథ. జయాపజయాలను సమంగా స్వీకరించిన స్థిరచిత్తుడు కేసీఆర్. రాళ్ళు విసిరిన చేతులే ఒకనాడు పూలు చల్లుతాయనే నమ్మకంతో ఆయన ముందడుగు వేశారు.