సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సోమవారం హుజూరాబాద్‌లో దళిత బంధు ప్రారంభం కాబోతోందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఈ మేరకు హుజూరాబాద్‌లో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కేసీఆర్ సభలో 15 మందికి ప్రభుత్వ సహాయాన్ని అందిస్తామని.. అనంతరం అర్హులు అందరికి అందజేస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌ను సీఎం ఎంపిక చేశారని ఆయన అన్నారు. భాజపా నాయకులు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. దళిత బంధు పథకం అర్హులందరికీ నూరుశాతం అందిస్తామన్నారు.
దళితబంధుపై భాజపా నాయకులు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని.. రైతు బంధు ప్రారంభించినపుడు కూడా అపోహలు సృష్టించారని మంత్రి హరీశ్ ఆరోపించారు. ఓటమి భయంతో ప్రజలను రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని ఆరోపించారు. దళిత బంధుకు రూ.2 వేల కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగితే ఎవరైనా ఆహ్వానిస్తారని హరీశ్ అన్నారు. బండి సంజయ్ రూ.50 లక్షలు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం శక్తి మేరకు రూ.10 లక్షలు అందిస్తోందని.. మిగతా రూ.40 లక్షలు కేంద్రం నుంచి బండి సంజయ్ ఇప్పించాలని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందజేస్తే పాలాభిషేకం చేస్తామన్నారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారి నియామకం జరుగుతుందని.. గ్రామసభలో ప్రజల మధ్యే పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి అర్హుడికీ దళిత బంధు అందుతుందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అర్హులకు పథకం అందిస్తామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.