ప్రజా రవాణాలో ఆటోలది కీలక పాత్ర. కానీ ఆటోడ్రైవర్ అంటే సమాజంలో ఓ చులకన భావం. ఆటో డ్రైవర్ల పరిస్థితిని గుర్తించిన తెలంగాణ మంత్రి హరీశ్‌రావు.. వారి జీవితాల్లో మార్పు తేవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక, జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా ఆటో క్రెడిట్ కోఆపరేటీవ్ సైసోటీని స్థాపించారు.
స్థలాన్ని తాకట్టు పెట్టి
దీనికి ఆర్థికంగా అండగా నిలవడానికి బ్యాంకులు, ప్రభుత్వానికి నిబంధనలు అడ్డు రావడంతో... మంత్రి హరీశ్‌రావు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సిద్దిపేటలోని తన ఇంటి స్థలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి సోసైటికీ రూ.45లక్షల మూలధనం సమకూర్చారు. కో ఆపరేటీవ్ సోసైటీని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి... డ్రైవర్లకు ఉచితంగా రెండు జతల యూనిఫాం, రూ.5వేల సాయం అదించారు.
బీమా సౌకర్యం
మంత్రి హరీశ్‌రావు పిలుపుతో 855మంది సోసైటీలో సభ్యులుగా చేరారు. వీరికి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడంతోపాటు తన మిత్రుల సహకారంతో రూ.4లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించారు. ఆటో డ్రైవర్ల ఇంట్లో శుభ, అశుభ కార్యాలు ఉంటే వాటి అవసరాల కోసం సోసైటీ నుంచి ఉచితంగా రూ.5వేలు సాయం అందిస్తారు. నైతిక విలువలు, వ్యక్తిగత పరిశుభ్రత, కుటుంబపోషణ, పిల్లల చదువులు, ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవడం వంటి అంశాలపై ప్రతి నెలా నిపుణులతో శిక్షణనిస్తారు.
ఆయనే మా ఆపద మొక్కులవాడు
పరపతి సంఘం నిర్వహణకు విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, విశ్రాంత పోలీస్ అధికారి, వైద్యుడు, అకౌంటెంట్‌తో నిర్వాహక కమిటీని ఏర్పాటు చేశారు. రెక్కాడితేగానీ డొక్కాడని తాము చేసిన కష్టం మొత్తం వడ్డీ వ్యాపారులకే దారపోసే వాళ్లమని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కోసం తన ఆస్తిని తనఖా పెట్టిన హరీశ్‌రావే తమకు ఆపద మొక్కులవాడని హర్షం వ్యక్తం చేశారు. ఇక నుంచి రింజిం.. రింజిం.. సిద్దిపేట.. ఆటోవాలా జిందాబాద్.. అనాల్సిందేనని మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. కష్టపడి పని చేసి మంత్రి పేరు నిలబెడతామని ఆటోడ్రైవర్లు ధీమా వ్యక్తం చేశారు.
ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సోసైటీని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు ఇదీ చదవండి :అంతుచిక్కని వ్యాధితో 21 మంది అస్వస్థత