ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వ్యవసాయ రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్​ వన్​: మంత్రి హరీశ్​ రావు - బడ్జెట్ 2021

తెలంగాణ రాష్ట్ర వార్షిక పద్దును శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్​రావు ప్రవేశపెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా సాగునీటి సదుపాయాన్ని మరింత పెంచే లక్ష్యంతో సాగునీటి రంగానికి రూ.16,931 కోట్లను కేటాయించారు. రుణమాఫీ కోసం తెలంగాణ బడ్డెట్​లో రూ.5,225 కోట్లు కేటాయించారు.

telangana budget
శెభాష్​ అనేలా

By

Published : Mar 18, 2021, 5:25 PM IST

నీరు సమృద్ధిగా లభించిన చోట వ్యవసాయం, పరిశ్రమలు అన్ని రంగాలు కళకళలాడుతాయని.. ఆ నీరే లేకపోతే అన్నీ వెలవెల పోతాయని తెలంగాణ మంత్రి హరీశ్ రావు తెలిపారు. నీటి ప్రాధాన్యత అందరికన్నా తెలంగాణకే ఎక్కువ తెలుసని.. చెరువులు ధ్వంసమై పోయి, బావులు, బోర్లు ఎండిపోయి, భూగర్భ జలాలు అడుగంటి అష్టకష్టాలు అనుభవించిందని గుర్తుచేశారు. రాష్ట్ర వార్షిక పద్దును శాసనసభలో ప్రవేశపెట్టి సాగునీటి రంగానికి రూ.16,931 కోట్లు కేటాయించారు.

రుణాల మాఫీపై మాట్లాడుతున్న మంత్రి హరీశ్​రావు

గత పాలకుల నిర్వాకమే..

గత పాలకులు అంతరాష్ట్ర వివాదాలకు ఆస్కారం కలిగించే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని.. అంతేకాకుండా రిజర్వాయర్ల నీటి సామర్థ్యాలను తగ్గించారని వ్యాఖ్యానించారు. గోదావరినదిపై కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు పూర్తయిందని.. సీతారామ ప్రాజెక్టు పూర్తి కావొస్తోందని.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

కాళేశ్వరం అపురూప ఘట్టం..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర చరిత్రలో ఓ అపురూప ఘట్టమని.. మేడిగడ్డ వద్ద సముద్రమట్టానికి వందమీటర్ల ఎత్తులో ప్రవహించే గోదావరి నీటిని, 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండ పోచమ్మ సాగర్​లోకి తీసుకొచ్చిన అద్భుతమైన సన్నివేశానికి మనమంతా సాక్షులుగా నిలిచామన్నారు. రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్​లను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేశామన్నారు. ఈ రిజర్వాయర్ల ద్వారా ప్రస్తుత యాసంగి పంటకు రైతులకు నీరందించి వారి హృదయాల్లో సంతోషాన్ని నింపామని వెల్లడించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా సాగు నీటి అవసరాల కోసం తలపెట్టి డిండి ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతున్నాయని. త్వరలోనే ప్రాజెక్టు పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టులో భాగమయిన సమ్మక్క సాగర్​ దాదాపు పూర్తయ్యిందని.. సీతారామ ప్రాజెక్టులో భాగమయిన సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు.

పూర్తైన కొత్త లిఫ్టులు

  • నాగార్జున సాగర్​ నియోజకవర్గంలో నెల్లికల్
  • దేవకొండ నియోజకవర్గంలో పోగిల్ల, కంబాలపల్లి, నంబాపురం-పెద్దగట్టు, పెద్దమునిగాల, అక్కంపల్లి
  • మిర్యాలగూడ నియోజకవర్గంలో దున్నపోతుల గండి-బాల్నేపల్లి, బాప్లాతండా, కేశవపురం-కొండ్రాపోల్, బొత్తలపాలెం-వాడపల్లి, వీర్లపాలెం, తోపుచర్ల
  • హుజూర్​నగర్​ నియోజకవర్గంలో ఎంబీసీ-ముక్త్యాల బ్రాంచి కెనాల్, జాన్​పాడ్​
  • జుక్కుల్ నియోజకవర్గంలో నాగ మడుగు
  • బాన్సువాడ నియోజకవర్గంలో జకోరా, చందూర్
  • ఆర్మూరు నియోజకవర్గంలో ముచ్చర్ల, కంమ్టం-చిక్లీ
  • బాల్గొండ నియోజకవర్గంలో చిట్టాపూర్
  • ధర్మపురి నియోజకవర్గంలో స్తంభం పల్లి, వెల్గటూరు, దమ్మనపేట
  • ముథోల్ నియోజకవర్గంలో పిప్రి
  • గద్వాల నియోజకవర్గంలో గట్టు
  • దుబ్బాక నియోజకవర్గంలో ఎల్లారెడ్డిపేట

రాబోయే రోజుల్లో నిర్మించే లిఫ్టులు

  • కొల్లాపూర్ నియోజకవర్గంలోని గోపాలదిన్నె
  • నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని మార్కండేయ
  • జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాలలో సంగమేశ్వర
  • నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బసవేశ్వర

తూర్పు ఆదిలాబాద్​లోని ఆసిఫాబాద్, సిర్పూరు, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల కోసం అయిదు లిఫ్టులకు, ఇల్లెందు నియోజకవర్గంలోని ఇల్లెందు లిఫ్టుకు, భద్రాచలం నియోజకవర్గంలోని ప్రగడపల్లి లిఫ్టుకు డీపీఆర్​లు సిద్ధమయ్యాయి. వీటికి అనుమతులను ప్రభుత్వం త్వరలోనే మంజూరు చేస్తుంది.

మిషన్ కాకతీయ

చెరువులు తెలంగాణ కల్పతరువులని వ్యవసాయంతో సహా అనేక వృత్తులకు చెరువులే ఆధారమని మంత్రి తెలిపారు. సమైక్య రాష్ట్రంలో చెరువు చుట్టూ ఆధారపడిన సామాజిక, ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయిందని.. రాష్ట్ర ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించేందుకు ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలను సాధించిందని వెల్లడించారు. ఈ పథకం ద్వారా వేలాది చెరువులు బాగుపడ్డాయని పేర్కొన్నారు.

మత్స్యకారులకు ఆదాయం పెరిగిందని.. భూగర్భ జల మట్టాలు పెరిగాయని పేర్కొన్నారు. గతంలో చిన్న వానపడినా చెరువు కట్టలు తెగేవని.. ఈ ఏడాది కనీవినీ ఎరుగని స్థాయిలో వానలు పడినా.. ఒకటి అరా మినహాయించి చెరువుల కట్టలేవి తెగలేదన్నారు. మిషన్ కాకతీయతో జరిగిన అభివృద్ధి జోరు వానలు పడినా చెరువులు చెక్కు చెదరకుండా ఉన్నాయని తన ప్రసంగంలో హరీశ్ పేర్కొన్నారు.

వ్యవసాయ రంగంలో దేశంలోనే నెంబర్​ వన్​గా తెలంగాణ: హరీశ్​ రావు

ఒకనాడు తెలంగాణకు వ్యవసాయం చేయడం చేతకాదన్న వాళ్లే.. నేడు వ్యవసాయ రంగంలో దేశంలోనే నెంబర్​ వన్​గా దూసుకెళ్తున్న రాష్ట్రాన్ని చూసి ఈర్ష్య పడే విధంగా ప్రగతి సాధించామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో నేడు సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పెరిగిందని తెలిపారు.

  • 2014-15లో సాగు విస్తీర్ణం- కోటి 41 లక్షల ఎకరాలు
  • 2020-21లో సాగు విస్తీర్ణం - 2 కోట్ల 10 లక్షల ఎకరాలు

49 శాతానికి పైగా వృద్ధి నమోదు

  • 2014-15 లో పంటల ఉత్పత్తి - 2 కోట్ల 5 లక్షల మెట్రిక్ టన్నులు
  • 2020-21లో పంటల ఉత్పత్తి - 4 కోట్ల 11 లక్షల మెట్రిక్ టన్నులు

గతంతో పోలిస్తే పంటల ఉత్పత్తి రెట్టింపవుతోంది.

పత్తిని అధికంగా పండిస్తున్న రెండో రాష్ట్రం

60 లక్షల 54 వేల ఎకరాల్లో పత్తి సాగు చేయడం ద్వారా తెలంగాణ.. దేశంలోనే పత్తిని అత్యధికంగా పండిస్తున్న రెండో రాష్ట్రంగా అవతరించింది. 2019-20 సంవత్సరంలో తెలంగాణలో 193 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. అందులో 111 లక్షల మెట్రిక్ టన్నులను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్​సీఐ) తెలంగాణ నుంచే సేకరించింది. వరి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే రెండో రాష్ట్రంగా నిలిచిందని స్వయంగా ఎఫ్​సీఐ ప్రకటించడం మనకు గర్వకారణం. 2020 సంవత్సరం యాసంగిలో ఎఫ్​సీఐ దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం ధాన్యంలో మన వాటా 56 శాతం కావడం గమనార్హం. ఈ యాసంగి సాగులో తెలంగాణ 52 లక్షల ఎకకాల సాగు విస్తీర్ణంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 25 లక్షల ఎకరాలతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. 20 లక్షల 90 వేల ఎకరాలతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది.

- హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి

ఆయిల్ పామ్​ ప్రోత్సాహకాలలో రాష్ట్రం ముందంజ..

భారత్ ఏడాదికి 70 వేల కోట్ల రూపాయల విలువ గల పామాయిల్​ను దిగుమతి చేసుకుంటోందని మంత్రి హరీశ్ అన్నారు. దీనికి బదులు దేశీయంగా ఉత్పత్తి చేస్తే బోలెడు విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతుందని తెలిపారు. తెలంగాణ రైతుకు ఆయిల్​పామ్ సాగు చేసేందుకు కావాల్సిన అన్ని రకాల సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని వెల్లడించారు. ఆయిల్ పామ్ సాగు వల్ల తెలంగాణ రైతులు మంచి లాభాలు పొందుతారని స్పష్టం చేసింది.

ఆయిల్​పామ్ పంట వేసిన తర్వాత నాలుగేళ్ల నుంచి దిగుబడి ప్రారంభమవుతుందని మంత్రి చెప్పారు. ఒక్కసారి వేస్తే 30 ఏళ్ల దాకా పంట దిగుబడి వస్తూనే ఉంటుందన్నారు. దీని ద్వారా రైతుకు నిరంతర ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఆయిల్ పామ్​ను ప్రోత్సహించేందుకు ఎకరానికి 30 వేల రూపాయలు సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించిందన్న హరీశ్.. ఇది పోగా మిగిలిన పెట్టుబడి భారం కూడా రైతుపై పడకుండా బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు కార్యాచరణ రూపొందించిందని వెల్లడించారు. రైతులు బ్యాంకుల వద్ద నుంచి తీసుకునే రుణాన్ని వెంటనే చెల్లించాల్సిన అవసరం లేకుండా నాలుగేళ్ల పాటు మారిటోరియం విధించే విధంగా బ్యాంకులను ఒప్పించిందని వివరించారు. రాష్ట్రంలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్​పామ్​ సాగుకు కావాల్సిన ప్రణాళికను సర్కార్ సిద్ధం చేసిందని మంత్రి హరీశ్ తెలిపారు.

రుణమాఫీ కోసం రూ.5,225 కోట్లు కేటాయింపు: మంత్రి హరీశ్​ రావు

గత ఎన్నికల్లో రాష్ట్రంలోని రైతులకు, లక్షలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చినట్లు హరీశ్​ రావు గుర్తు చేశారు. రూ.25 వేల ఉన్న రుణాలను ఇప్పటికే మాఫీ చేసినట్లు తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మిగతా రైతులకున్నా రుణాలను రద్దు చేయడంలో కొంత ఆలస్యం జరిగింది. త్వరలోనే ఈ రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుంది.

రాష్ట్ర వార్షిక బడ్జెట్​లో రుణమాఫీ కోసం రూ.5,225 కోట్లు కేటాయించారు. రైతు బీమా కోసం రూ. 1200 కోట్లు కేటాయించారు. ఏ కారణంతోనైనా రైతులు మరణిస్తే బాధిత కుటుంబం అనాథ కావొద్దని ప్రభుత్వం భావించిందని హరీశ్​రావు తెలిపారు. రైతు కుటుంబాల సంక్షేమం కోసం రైతు బీమా పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. గుంట భూమి ఉన్న రైతు మరణించినా ఆ అన్నదాత కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్ము చెల్లిస్తున్నట్లు తెలిపారు.

రైతు బీమా పథకం ద్వారా 2020-21 సంవత్సరంలో 32.73 లక్షల మంది రైతులకు సంబంధించిన ప్రీమియం మొత్తం రూ.1141.4 కోట్లను ప్రభుత్వం ఎల్​ఐసీకి చెల్లించిందని పేర్కొన్నారు. గత మూడేళ్లలో 46,564 రైతు కుటుంబాలకు రూ.2,328 కోట్లు అందించినట్లు తెలిపారు.

గంట భూమి కలిగి ఉన్నా.. రైతు బీమా వర్తిస్తుండడం వల్ల ప్రతి ఒక్కరూ తమ పేరుతో ఎంతో కొంత భూమి ఉండాలని కోరుకుంటున్నారని హరీశ్​ అన్నారు. ఉన్న భూమిని కూడా కుటుంబంలోని వారసులకు పంచి ఇస్తున్నారన్నారు. దీని వల్ల పాలసీదారుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు బీమా పథకానికి రూ.1,200 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:

తెలంగాణ: రైతుబంధు పథకానికి 14,800 కోట్లు: హరీశ్ రావు

ABOUT THE AUTHOR

...view details