ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నాణ్యమైన ఉద్యోగాలు కల్పిస్తే భారీ ప్రోత్సాహకాలు: మంత్రి గౌతమ్ రెడ్డి - ఏపీ నూతన పారిశ్రామిక విధానం 2020

కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా మూడేళ్ల స్వల్పకాలిక పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చామని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. పది రంగాలకు చెందిన పరిశ్రమల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు వీలుగా నూతన విధానాన్ని రూపొందించామన్నారు. కొత్త పారిశ్రామిక విధానం గురించి మరిన్ని విషయాలను ఆయన ఈటీవీ భారత్ తో పంచుకున్నారు.

మంత్రి గౌతమ్ రెడ్డి
మంత్రి గౌతమ్ రెడ్డి

By

Published : Aug 10, 2020, 4:36 PM IST

Updated : Aug 10, 2020, 6:46 PM IST

ఈటీవీ భారత్ తో మంత్రి గౌతమ్ రెడ్డి ఇంటర్వ్యూ

ఈటీవీ భారత్ : ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుని నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు?

మంత్రి గౌతమ్ రెడ్డి : వ్యూహాత్మకంగా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే 10 రంగాలను ఎంచుకుని వాటికి అనుగుణంగానే నూతన పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేశాం. పెట్రో కెమికల్స్ , రక్షణ రంగ పరిశ్రమలు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు ఏపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఫర్నీచర్, ఆటబొమ్మల తయారీ, ప్లాస్టిక్ పరిశ్రమలు ఇలా చాలా పరిశ్రమలు ఏపీపై ఆసక్తిగా ఉన్నాయి. అయితే నూతనంగా వచ్చే పరిశ్రమలకు ఎలాంటి వివాదాలు లేని భూములు ఇవ్వాలన్నది లక్ష్యం. అలా 45 వేల ఎకరాలను గుర్తించాం. రాష్ట్రంలోకి అత్యుత్తమమైన భారీ పరిశ్రమలు రావాలంటే నైపుణ్యం ఉన్న కార్మికులు అవసరం. వారిని తయారు చేసేందుకు 30 నైపుణ్య కళాశాలలను కూడా సిద్ధం చేస్తున్నాం. ఐఎస్​బీతో కూడా ఒప్పందం కుదిరింది.

ప్రశ్న : 2023 వరకూ మాత్రమే పారిశ్రామిక విధానం అమల్లో ఉంటుందని చెబుతున్నారు. అప్పటి వరకూ ఈ లక్ష్యాలు సాకారం అవుతాయా?

జవాబు : కొవిడ్ వచ్చి దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరుచుకునే సమయం ఇవ్వటం లేదు. ఏ పరిశ్రమ ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. గడచిన 6 నెలలుగా సేవారంగ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కోంది. కానీ వైద్య పరికరాలు, ఔషధ ఉత్పత్తి పరిశ్రమలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. అంటే అవకాశాలు కొన్నిచోట్ల ఉన్నాయి. అందుకే పరిశ్రమలు అందిపుచ్చుకునేలా స్వల్పకాలిక పారిశ్రామిక విధానం తెచ్చాం.

ప్రశ్న : మీరు తెచ్చే సంస్కరణలకే మూడేళ్ల కాలం సరిపోదు. 2023 తర్వాత ఏం చేయాలని భావిస్తున్నారు?

జవాబు : ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం లేదు. అందుకే ఏపీ పరిశ్రమల శాఖ స్వల్పకాలిక లక్ష్యాల సాధనకే హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుత సమయాలను ఏ రకంగానూ అంచనా వేయలేం కాబట్టే ఇంత స్వల్పకాలిక విధానం అమలులోకి తీసుకువచ్చాం.

ప్రశ్న : ఇంత స్వల్పకాలిక పారిశ్రామిక విధానంతో పొరుగురాష్ట్రాలతో ఎలా పోటీ పడగలరు?

జవాబు: ఆంధ్రప్రదేశ్ చాలా అంశాల్లో అగ్రగామిగా ఉంది. అందుకే ఈ స్వల్పకాలిక విధానం ద్వారా ముందుకు వెళ్లగలమని భావిస్తున్నాం. ఎంఎస్ఎంఈలకు బకాయి ప్రోత్సాహకాలు చెల్లించాం. ఏ రాష్ట్రం ఇలా చెల్లించలేకపోయింది. ఉత్తరప్రదేశ్ ఇటీవలే పారిశ్రామిక విధానం తెచ్చింది. వారితో పాటు ఇప్పుడు మనం కూడా ముందున్నాం. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నదే మా లక్ష్యం.

ప్రశ్న : గతంలో చేసుకున్న ఎంవోయూలకు సంబంధించి సమీక్ష చేస్తారా లేక యథాతథంగా అమలు చేస్తారా?

జవాబు : ప్రతీ అంశాన్నీ పరిశీలించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సాహకాలు మాత్రం ఇప్పుడే ఇవ్వబోం. 2019 వరకూ ఉన్న బకాయిలను మాత్రం పూర్తి చేస్తాం. అయితే కియా కార్ల పరిశ్రమ విషయంలో మాత్రం వేరు. ఎందుకంటే ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం కాబట్టీ పాత పారిశ్రామిక విధానం దానికి అమలవుతుంది. అయితే ఎక్కువ నాణ్యత కలిగిన ఉద్యోగాలు కల్పిస్తే భారీ పరిశ్రమలకు ఎక్కువ ప్రోత్సాహకాలే ఇస్తామని మా కొత్త విధానం చెబుతోంది.

ప్రశ్న : ప్రతి ప్రభుత్వం ఏదో ఒక విధానాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తుంది. కానీ వాటిని అమలు చేసే సమయంలో మాత్రం విఫలం చెందుతుంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి?

జవాబు : ఈ విషయం వాస్తవమే. అది ఎంత మంచి విధానమైనా చట్టమైనా.. వాస్తవికంగా అమలు అయినప్పుడే దాని విలువ ఉంటుంది. ఈ విధానాలు అమలు కావాలనే ఐఎస్​బీతో ఒప్పందం చేసుకున్నాం. అందుకే క్షేత్రస్థాయిలో ఈ విధానాల అమలు కోసం ఐఎస్​బీతో పని చేస్తున్నాం. పరిశ్రమల శాఖ జేడీ, జిల్లా జేసీలు కలిసి వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు.

ప్రశ్న : ఐటీ, ఎలక్ట్రానిక్ పాలసీ ఎప్పుడు రాబోతోంది?

జవాబు : ఇప్పటికే రాష్ట్ర ఐటీ విధానాన్ని రూపొందించాం. తుది మెరుగులు దిద్దుతున్నాం. మరో పది రోజుల్లో దీన్ని కూడా ఆవిష్కరిస్తాం.

ఇదీ చదవండి :నూతన పారిశ్రామిక విధానం ప్రకటించిన ప్రభుత్వం

Last Updated : Aug 10, 2020, 6:46 PM IST

ABOUT THE AUTHOR

...view details