రాష్ట్రంలో బీసీ కులాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడాన్ని పురస్కరించుకుని... బీసీలంతా 3 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జ్యోతిరావ్ పూలేల విగ్రహాలకు పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు, వెన్నెముకలాంటి వర్గాలని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. 139 కులాలకు కార్పొరేషన్లలో ప్రాధాన్యం కల్పించారని తెలిపారు. బీసీ సంక్షేమం కోసం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే మిన్నగా ప్రభుత్వం 16 నెలల్లో వివిధ పథకాల ద్వారా దాదాపు రూ.33,500 కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో 56 కార్పొరేషన్లను ప్రకటించడాన్ని పురస్కరించుకుని ఈనెల 20 వరకు పర్వదినాలుగా నిర్వహించాలని తమ పార్టీ నిర్ణయించిందని వెల్లడించారు.