రాష్ట్రంలోని 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకాన్ని బుధవారం ప్రారంభిస్తుందని... బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్రవ్యాప్తంగా రూ. 4700 కోట్లను 20 లక్షల లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నామని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి మహిళ ఖాతాలో 18,750 రూపాయల నగదు జమ అవుతుందని.. వరలక్ష్మీ వ్రతం పర్వదినాన మహిళలకు ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న కానుక అని వ్యాఖ్యానించారు.
కరోనా వ్యాప్తిని ముందే గ్రహించిన ముఖ్యమంత్రి ప్రజలందరూ ఆ వ్యాధితో జీవించాల్సి వస్తుందని అప్రమత్తం చేస్తే...ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేశాయని ఆక్షేపించారు. ఇవాళ ప్రధానితో సహా అన్ని దేశాల అధినేతలు కూడా అదే మాట చెబుతున్నారని గుర్తు చేశారు.