Minister Bugna on cps: కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానం (సీపీఎస్) రద్దు అనేది అంత సులభమైన అంశం కాదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. దీనిపై త్వరలో ప్రభుత్వం విధానపరమైన ప్రకటన చేస్తుందని చెప్పారు. శాసన మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానంపై మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘సీపీఎస్ విధానంపై ప్రభుత్వ పరిశీలన అడ్వాన్స్ దశలో ఉంది. గత నెలన్నరగా దీనిపై ముమ్మరంగా పని చేస్తున్నాం. కాబట్టే సీఎం వారానికి ఒకసారి రివ్యూ చేస్తున్నారు. అంటే అది తుది దశకు చేరినట్లే లెక్క. దీనికి సంబంధించిన అన్ని అంశాలనూ బయటకు చెప్పడం సాధ్యం కాదు. తుది రూపం వచ్చేవరకు.. వివరాలను బయటకు చెబితే వేరే అర్థాలు వచ్చే అవకాశం ఉంది. అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పగలను.
ఈ రోజు మధ్యాహ్నం కూడా సీఎం దగ్గర సమావేశం ఉంది. ఈ సమావేశం నిన్ననే జరగాల్సింది. ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ అందుబాటులో లేని కారణంగా ఈ రోజుకు వాయిదా పడింది. సీపీఎస్ రద్దు అనేది మన రాష్ట్రానికే కాదు. ఇతర రాష్ట్రాలకూ పెద్ద సమస్య. ఈ రాష్ట్రంలో భాజపా సభ్యులు సీపీఎస్ రద్దుకు మద్దతు తెలుపుతున్నారు. దీనిపై వారి అధిష్ఠానంతో ఒకసారి మాట్లాడి అనుమతి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దేశంలో వారి ఆలోచన అలా లేదు. వారు ఇక్కడ ఏ విశ్వాసంతో చెబుతున్నారో అర్థం కావటం లేదు. సీపీఎస్ పట్ల ప్రభుత్వం వచ్చిన వెంటనే మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. టక్కర్ కమిటీ నివేదికపై అధ్యయనం చేసి ముందుకు వెళ్తోంది. ఆ తర్వాత మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించడానికి అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది. గతంలో పలు మార్లు సభలో ఇదే విషయాన్ని చెప్పాను. దురదృష్టవశాత్తు కొవిడ్ పరిణామాలతో దీనిపై ముందుకు వెళ్లలేక పోయాం’ అని పేర్కొన్నారు. మంత్రి సమాధానంపై పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, ఇతర ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. విఠపు మాట్లాడుతూ.. ‘ సీపీఎస్‌ను రద్దు చేస్తామని స్పష్టంగా చెప్పటం లేదు. కరోనా వల్ల నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. సీపీఎస్ రద్దుపై నిర్ణయాన్ని ఆఫీసులో ఉండి తీసుకోవాలి. ఇప్పుడు మంత్రి మాట్లాడుతూ ఇది అంత సులభం కాదు. దేశ వ్యాప్తంగా.. ప్రపంచ వ్యాప్తంగా ఉందని అంటున్నారు. మీరు ఇచ్చిన హామీ కనీసం నమ్మకం కలిగించేలా లేదు. ఇది చాలా బాధాకరం’ అని అన్నారు. మరో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా సీపీఎస్ రద్దు చేస్తామని చెబుతున్నాయని, మూడేళ్లుగా ఎందుకు నిర్ణయాన్ని ప్రకటించలేదని ప్రశ్నించారు.