స్థానిక ఎన్నికలు వాయిదా వేసేముందు ప్రభుత్వంతో ఎస్‌ఈసీ చర్చించారా? అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్.. వైద్య శాఖలోని ఎవరితో సమీక్ష జరిపారని అడిగారు. ఎక్కడైనా అనధికారికంగా సమీక్ష జరుపుతారా? అని ప్రశ్నించారు. కరోనా వల్ల వాయిదా వేస్తే.. ఎన్నికల కోడ్ 6 వారాలపాటు ఎందుకు ఉంచారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు ఎన్నికల కోడ్ అడ్డు రాదా? అని ప్రశ్నించారు.
స్థానిక ఎన్నికలు ఆపాలని ఎవరైనా కుట్ర చేస్తున్నారనే అనుమానం వస్తోందన్న మంత్రి బుగ్గన... ఎన్నికలు ఆపేందుకు తోమర్ కేసును వాడకూడదన్నారు. స్థానిక ఎన్నికలు పెట్టేముందు ప్రభుత్వంతో సంప్రదించాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. ఎస్‌ఈసీ సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో గెలవకుంటే పదవులు పోతాయని ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు.
స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం ఎలా అవుతాయన్నది తెదేపా అధినేత చంద్రబాబుకు తెలియదా అన్నారు. కర్నూలులో అనేకచోట్ల తెదేపా నేతలు నామినేషన్లు వేశారన్న ఆయన.. డోన్ పురపాలికను తెదేపా పూర్తిగా వదిలిపెట్టిందని ఆరోపించారు. తెదేపా నేతలతో తాము బలవంతంగా నామినేషన్లు వేయించాలా? అని వ్యాఖ్యానించారు.