ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Buggana: ఏ పెన్ను, పెన్సిల్‌ వాడాలో చెబితే ఎలా: మంత్రి బుగ్గన - మంత్రి బుగ్గన

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సమర్థంగా పనిచేసేలా సంస్కరణలు చేపడుతున్నామని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణ, ఉద్యోగుల హక్కులను హరించేలా ఉందని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. సీనియర్‌ అధికారుల సమావేశం జరుగుతుందనుకున్న తరుణంలో మంత్రి బుగ్గన ఊహించని విధంగా కార్యాలయానికి వచ్చారు.

Minister Buggana
మంత్రి బుగ్గన

By

Published : Jul 21, 2022, 9:54 AM IST

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సమర్థంగా పనిచేసేలా తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే సంస్కరణలు చేపడుతున్నామని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. విజయవాడ శివారు ఈడ్పుగల్లులోని వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయానికి వచ్చిన మంత్రిని ఉద్యోగులు చుట్టుముట్టారు. పునర్‌వ్యవస్థీకరణ, బదిలీల ప్రక్రియతో నష్టపోతున్నామంటూ నినాదాలు చేశారు. ప్లకార్డుల ద్వారా తమ నిరసన వ్యక్తంచేశారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణ ఉద్యోగుల హక్కులను హరించేలా ఉందని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. పారదర్శకంగా లేని బదిలీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. సంస్కరణల వల్ల వాణిజ్యపన్నుల శాఖ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మంత్రికి విజ్ఞాపన పత్రాన్ని అందచేశారు. వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు ఈ నెల 13 నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఈడ్పుగల్లులోని ప్రధాన కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేయనున్నారు. సీనియర్‌ అధికారుల సమావేశం జరుగుతుందనుకున్న తరుణంలో మంత్రి బుగ్గన ఊహించని విధంగా కార్యాలయానికి వచ్చారు.

‘సంస్కరణలపై వచ్చిన సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుంటాం. ఆందోళన చెందక్కర్లేదు. అంతేకానీ, ఏ పెన్ను వాడాలో... ఏ పెన్సిల్‌ వినియోగించాలో కూడా మీరే చెబుతామంటే సరికాదు. రోడ్లు బాగుంటే కొత్త రోడ్డు వేసుకోం కదా! ఇళ్లు బాగుంటే పీకేసి మళ్లీ కట్టాలని ఎవరూ అనుకోరు. సంస్కరణల నిర్ణయాలపై ఇంకా పరిశీలన జరుగుతోంది’ అని ఆర్ధిక మంత్రి బుగ్గన స్పష్టంచేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details