రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ ఎస్ఈసీకీ ప్రభుత్వానికి మధ్య అంతరాలు పెరగకుండా తగ్గించడమే లక్ష్యంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రయత్నాలు చేస్తున్నారు. పలు అంశాల్లో ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి వారు పట్టుదలతో ముందుకు వెళ్తుండటంతో వివాదం ముదరకుండా చర్యలు చేపట్టారు. దీనికోసం ముందుగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో సమావేశమైన గవర్నర్... అనంతరం ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎంవో ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఏజీ శ్రీరాంతో విడివిడిగా సమావేశమయ్యారు.
తొలుత ఎస్ఈసీతో...
తొలుత గవర్నర్తో 20 నిముషాల పాటు ఎస్ఈసీ సమావేశమయ్యారు. రేపు పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీసుకున్న చర్యలపై ముందుగా వివరించారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగులతో తాను జరిపిన సమావేశం వివరాలు, సహకరిస్తామని వారు ఇచ్చిన హామీ తదితర అంశాలను గవర్నర్కు వివరించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన ప్రభుత్వ ఉన్నతాధికారులపై తాను తీసుకున్న చర్యలను గవర్నర్తో నిమ్మగడ్డ చర్చించినట్లు తెలిసింది. ఏ పరిస్దితుల్లో తాను నిర్ణయాలు తీసుకుంటున్నాననే విషయమై సమగ్రంగా వివరించినట్లు సమాచారం. ప్రభుత్వం, వైకాపా నేతలు తనపై చేస్తోన్న విమర్శలపై గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సహా మంత్రులపై చర్యలు తీసుకోవాలని రాసిన లేఖపై ఎస్ఈసీతో గవర్నర్ చర్చించినట్లు తెలిసింది. పంచాయతీ ఎన్నికలు సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సహకరించాలని గవర్నర్ను ఎస్ఈసీ కోరినట్లు సమాచారం. ప్రభుత్వంతో సామరస్య పూర్వకంగా ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలిసింది.
బుగ్గన, ఏజీలతో..