Minister Botsa On OTS: ఇళ్లను రిజిస్ట్రేషన్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటీఎస్ పథకంపై ప్రజలు సహాయ నిరాకరణ చేయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రజలు సహాయ నిరాకరణ చేసేందుకు తామేమీ బలవంతంగా డబ్బు లాక్కోవడం లేదన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. అధికారంలో ఉండగా పేదల ఇళ్లను చంద్రబాబు ఎందుకు రిజిస్ట్రేషన్లు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
Minister Botsa On Chandrababu: ఎవరు మోసగాళ్లు, ఎవరు మంచివారు అనే సంగతి ప్రజలకు తెలుసన్నారు మంత్రి బొత్స. చంద్రబాబు నోరును అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. ఒటీఎస్ పథకం బలవంతంగా ఎవరిపైనా రుద్దే కార్యక్రమం కాదని, పథకం నచ్చిన వారు స్వచ్ఛందంగా ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. పేదలకు ఇంటిపై హక్కులు కల్పించడమే ఒటీఎస్ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామీణ ప్రాంతంలో 10 వేలు, పట్టణాల్లో 15 వేలు, కార్పొరేషన్లలో 20వేలు కడితే ఇంటిని రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం 7 శాతం రుసుం తీసుకోవాల్సి ఉండగా ఇప్పుడు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. ఒటీఎస్ పథకంపై అత్యుత్సాహం చూపిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పేదలకు సొంతింటిపై సంపూర్ణ హక్కులు కల్పించడమే ఒటీఎస్ పథక ముఖ్య ఉద్దేశమన్నారు.
Minister Botsa On Butchaiah Chowdary: తెదేపా నేత బుచ్చయ్య చౌదరి చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని మంత్రి బొత్స సవాల్ విసిరారు. ఈ విషయంలో రాజీనామా చేసేందుకు సిద్ధమేనని తేల్చి చెప్పారు. చట్టానికి చట్టానికి లోబడే నిబంధనల ప్రకారం సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు అనుమతించామన్నారు. ఇది చట్ట వ్యతిరేకం అని ఎవరైనా అనుకుంటే దీనిపై కోర్టులకు వెళ్లవచ్చన్నారు. ఒటీఎస్ స్కీము కింద ఇళ్ల రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 20తో ముగుస్తుందని, రిజిస్ట్రేషన్ల గడువును పెంచే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు.