చంద్రబాబుపై తమకు ఎలాంటి కక్ష లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వరద నిర్వహణ చేతకాదని తెదేపా నేతలు లేనిపోని ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. రాజధాని రైతులకు కౌలు, పింఛను ఇవ్వాలని తమకు తెలుసని మంత్రి బొత్స పేర్కొన్నారు. అవినీతిని పూర్తిగా అరికడతాం.. కాస్త ఓపిక పట్టాలన్నారు. మెట్రో ప్రాజెక్టులపై అన్నిరకాలుగా సమీక్ష చేస్తున్నామన్న బొత్స... త్వరలో అన్ని వివరాలు బయటపెడతామని చెప్పారు.
తలసరి ఆదాయం, జీడీపీ పెరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాజధానిలో తప్ప మరెక్కడా భూముల రేటు పెరగకూడదా..? అని ప్రశ్నించారు. ఈ విషయంలో చంద్రబాబు విధానం ఏమిటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎం.ఎస్.పి.రామారావు పేరుతో భూములు అప్పగించారన్న బొత్స... ల్యాండ్ పూలింగ్ కింద కొందరి పేర్లపై 25 వేల చదరపు గజాలు ఉన్నాయని వెల్లడించారు. అందరి వ్యక్తుల జాబితా తమ వద్ద ఉందన్న మంత్రి... రాజధాని కోసం కేంద్రం రూ.1,500 కోట్లు ఇచ్చిందని వివరించారు.
శాసనసభ్యులు, మంత్రులు, న్యాయమూర్తుల క్వార్టర్స్ తప్ప అన్నీ తాత్కాలిక భవనాలేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. టెండర్లు పిలిచినప్పుడు చంద్రబాబు విధానాలు పాటించలేదని పేర్కొన్నారు. టెక్నాలజీ తెచ్చానని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ముంపు వస్తుందని కాల్వల నిర్మాణం, లిఫ్ట్ పెట్టడం టెక్నాలజీయా..? అని ప్రశ్నించారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఎందుకు సమగ్రంగా పరిశీలించలేదని నిలదీశారు. ఆదరాబాదరాగా నారాయణ కమిటీని ఎందుకు వేశారన్న బొత్స... అప్పుడు వ్యతిరేకించిన పార్టీతోనే చంద్రబాబు ఇప్పుడు స్నేహం చేస్తున్నారని విమర్శించారు.