దేశ చరిత్రలో ఏడాదిలోనే 90 శాతం ఎన్నికల హామీలను అమలు చేసిన తొలి సీఎంగా జగన్ నిలిచిపోతారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు దాదాపు అమలు చేశారని తెలిపారు. జగన్ అమలు చేసిన పథకాలు ప్రజల్లోకి తీసుకువెళతామని.. ప్రతిపక్షాల దుష్ట ఆలోచనలు ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
జగన్ పాదయాత్ర చేపట్టి మూడేళ్లయిన సందర్భంగా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజల్లో నాడు... ప్రజల కోసం నేడు' కార్యక్రమంలో బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న పలువురిని సన్మానించారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఒక చరిత్ర అని పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని.. ప్రజల్లో ఆదరణ ఓర్వలేక ప్రాణాలు కూడా తీసేందుకు ప్రయత్నించారన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు కనుకే సంక్షేమ పాలన అందిస్తున్నారని వ్యాఖ్యానించారు.