కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆస్పత్రుల్లో బెడ్లు, మందులు, ఆక్సిజన్‌పై సమీక్షిస్తున్నామని.. బెడ్లను 50 వేలకు పెంచేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. 104కు ఫోన్ చేసిన 3 గంటల్లో బెడ్ కేటాయింపునకు ఆదేశించామని వెల్లడించారు. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో విపత్కర పరిస్థితులున్నాయన్న ఆయన.. రాజకీయాలకు సంబంధం లేకుండా అందరూ చేయూత ఇవ్వాలన్నారు. ఆక్సిజన్ కొరతతో విజయనగరం జిల్లాలో ఎవరూ చనిపోలేదని తెలిపారు. ఇతర ఆస్పత్రులకు తరలించి రోగుల ప్రాణాలను కాపాడారని వెల్లడించారు.
ఆక్సిజన్ ఉత్పత్తి చేసి సరఫరా చేయాలని పరిశ్రమలను ఆదేశించామని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 2 ఆక్సిజన్ ప్లాంట్ల వినియోగానికి చర్యలు తీసుకున్నామని.. ఇబ్బందులు లేకుండా పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎన్నో రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని.. ఇతర పోటీ పరీక్షల్లో రాణించాలంచే పరీక్షల నిర్వహణ తప్పనిసరి అని అన్నారు. పరీక్షలే వద్దనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చేది కదా అని వ్యాఖ్యానించారు.