ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BOTSA ON HOUSES: టిడ్కో ఇళ్లు 18 నెలల్లోగా ఇస్తాం: మంత్రి బొత్స - కాలవ శ్రీనివాసులు వార్తలు

రాష్ట్రంలో టిడ్కో ఇళ్లను మూడు దశల్లో పూర్తి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 3 నుంచి 6 నెలల్లో 90 వేలు, 12 నెలల్లో మరో 90 వేల ఇళ్లు, మిగిలిన సుమారు 75వేల ఇళ్లను 18 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. టిడ్కో ఇళ్లపై చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు విశ్వసించరని వ్యాఖ్యానించారు. టిడ్కో గృహాలను నెల రోజుల్లో లబ్ధిదారులకు అందజేస్తామని బుధవారం చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ 24గంటల్లోనే మాట మార్చేశారేమని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు.

Minister Botsa
మంత్రి బొత్స

By

Published : Jul 30, 2021, 9:10 AM IST

‘రాష్ట్రవ్యాప్తంగా 163 ప్రాంతాల్లోని టిడ్కో ఇళ్లలో 3 నుంచి 6 నెలల్లో 90 వేలు, 12 నెలల్లో మరో 90 వేల ఇళ్లు, మిగిలిన సుమారు 75వేల ఇళ్లను 18 నెలల్లో పూర్తి చేస్తాం’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రజల పట్ల నిర్లక్ష్యంగా లేమని... అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. గురువారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘చంద్రబాబు హయాంలో 7 లక్షల ఇళ్లను నిర్మిస్తామని కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకుని వాటిలో 4.54 లక్షల ఇళ్లే మంజూరు చేస్తూ జీఓ ఇచ్చారు. వాటిలోనూ 3.13 లక్షల ఇళ్ల పనులే చేపట్టారు. అందులో 51,616 ఇళ్లను గ్రౌండ్‌ చేశారు. ఎక్కడా మౌలిక సదుపాయాలను కల్పించలేదు’ అని విమర్శించారు.

ఎవరిచ్చినవి పిచ్చుక గూళ్లు?
జగనన్న కాలనీల పేరుతో పిచ్చుక గూళ్ల లాంటి ఇళ్లను ఇస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతున్నారని మంత్రి బొత్స విమర్శించారు. ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇందిరమ్మ ఇళ్లు ఒక్కోటి 215 చదరపు అడుగులు ఇవ్వగా, 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో 6 లక్షల ఇళ్లు కట్టారు, అవి ఒక్కోటి 224 చదరపు అడ[ుగులు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ ఒక్కోటి 340 చదరపు అడుగుల స్థలంలో 28 లక్షల ఇళ్లను కడుతున్నారు. 224 చ.అడుగుల్లోనే చంద్రబాబు పెద్ద భవంతులు కట్టించి ఇచ్చారా? ప్రజలకు వాస్తవాలు అర్థమవుతున్నాయి. 17 వేల కాలనీలను కొత్తగా నిర్మించబోతున్నాం. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు విశ్వసించరు’ అని వ్యాఖ్యానించారు.

‘పోలవరం ప్రాజెక్టుకయ్యే పూర్తి మొత్తాన్ని కేంద్రమే భరించాలని మేం (వైకాపా) డిమాండు చేస్తున్నాం. కేంద్రం అలా చేస్తుందనే ఆశిస్తున్నాం’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకోవాలంటే త్రిసభ్య కమిటీ ఆమోదం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు లేఖ రాయడంపై ఓ విలేకరి అడగ్గా మంత్రి స్పందిస్తూ.. ‘ఏ రాష్ట్రాలైనా వారి అభిప్రాయాలను చెప్పవచ్చు. కానీ, మానవతా దృక్పథంతో, వాస్తవాలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాం’ అన్నారు.

24 గంటల్లో మాట మార్చేశారేం?: కాలవ శ్రీనివాసులు

టిడ్కో గృహాలను నెల రోజుల్లో లబ్ధిదారులకు అందజేస్తామని బుధవారం చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ 24గంటల్లోనే మాటమార్చేశారేమని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. ‘‘రెండేళ్ల క్రితమే 2.62 లక్షల ఇళ్లను 90 శాతంపైగా పూర్తి చేస్తే, ఆరు నెలల్లో 90 వేలు, 18నెలల్లో 1.70 లక్షల ఇళ్లు దశలవారీగా ఇస్తామంటున్నారు. 10 శాతం పనులు పూర్తి చేయటానికి అంత సమయం అవసరమా. టిడ్కో కింద తెదేపా ప్రభుత్వం 7.58 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే వైకాపా ప్రభుత్వం కక్షతో 4.96లక్షల ఇళ్లను రద్దు చేసింది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 7.10 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 90 వేల ఇళ్లు నిర్మించటంతో పాటు వైఎస్‌ హయాంలో అసంపూర్తిగా నిలిచిన 4.40 లక్షల ఇళ్లకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాం. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అదనంగా మరో రూ.లక్ష ఇచ్చాం. పేదల గృహనిర్మాణానికి తెదేపా ప్రభుత్వం రెండు సెంట్ల భూమి కేటాయిస్తే వైకాపా ప్రభుత్వం దాన్ని సెంటుకు కుదించింది. వైకాపా నేతలు రూ.6,500 కోట్ల అవినీతికి పాల్పడుతూ ఆవాసయోగ్యం కాని ప్రదేశాల్లో ఇళ్లస్థలాలకు భూమిని సేకరించారు. జగనన్న కాలనీలు వర్షాలతో తటాకాలుగా మారాయి. ఇల్లు నిర్మించుకోకపోతే పట్టా రద్దుచేస్తామని పేదల్ని బెదిరించటం దుర్మార్గం. ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం ఇంటికి రూ.5 లక్షలు అవసరం కాగా, కేంద్రం ఇచ్చే రూ. 1.5 లక్షలు, ఉపాధి హామీ కింద ఇచ్చే మరో రూ.30వేలు కలిపి రూ.1.8 లక్షలతో ఇంటి నిర్మాణాన్ని పేదలు ఎలా పూర్తి చేస్తారు’’ అని ఓ ప్రకటనలో నిలదీశారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో రెండేళ్లుగా రాయితీ రుణాలకు మంగళం

ABOUT THE AUTHOR

...view details