ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని ప్రజలందరిది.. ఓ వర్గానిది కాదు: మంత్రి బొత్స - అమరావతిపై మంత్రి బొత్స

రాజధాని అమరావతి వ్యవహారంపై మంత్రి బొత్స మరోసారి వ్యాఖ్యలు చేశారు.

botsa

By

Published : Sep 1, 2019, 1:18 PM IST

రాజధాని ప్రజలందరిది.. ఓ వర్గానిది కాదు: మంత్రి బొత్స

నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంపై.. మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అన్నది రాష్ట్రానికి సంబంధించిన విషయంగా అందరూ గుర్తించాలని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కార్యాలయంలో వ్యాఖ్యానించారు. రాజధాని ఓ సామాజిక వర్గానికి చెందినది కాదని చెప్పారు. రాష్ట్రానికి జగన్ నాయకత్వం అవసరమన్న బొత్స.. తెదేపాపై నమ్మకం పోయినందునే ప్రజలు ఈ సారి అవకాశం ఇవ్వలేదని అన్నారు.

''ఇటీవల సీఆర్‌డీఏపై అధికారులతో కలిసి సీఎం జగన్‌ సమీక్షించారు. సమావేశంలో రాజధానికి భూసేకరణ అంశాలు, కుంభకోణాలు బయటకు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీల పేరుతో బీ ఫారం పట్టాలు, అసైన్డ్‌ భూములపై వెలుగులోకి వచ్చాయి. ఒక్కొక్కరికి ఒక్కో ధరకు ఇష్టారాజ్యంగా కేటాయింపులపై చర్చకు వచ్చింది. సింగపూర్‌ కంపెనీకి 1700 ఎకరాల భూమి కేటాయింపుపై చర్చకు వచ్చింది. తాత్కాలిక సచివాలయం పెట్టి ఎస్‌ఎఫ్‌టీ రూ.10వేలకు ఇచ్చిన అంశాలు చర్చకు వచ్చాయి. కుంభకోణాలను ప్రజల ముందుకు తేవడంపై కార్యక్రమాలు చేపడుతున్నాం'' అని అన్నారు.. మంత్రి బొత్స.

పవన్ కల్యాణ్ వైఖరిపై ఆగ్రహం

ఎన్నికలకు ముందు వరకు పవన్‌ కల్యాణ్‌ తెదేపాకు పరోక్షంగా మద్దతు పలికారని బొత్స ఆరోపించారు. ఇటీవల తెదేపాకు మద్దతుగా పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు చేశారన్నారు. గతంలో అధికారంలో ఉన్న తెదేపాను పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించలేదని గుర్తు చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్‌, వైకాపా లక్ష్యంగా పవన్‌ వ్యాఖ్యలు చేశారన్నారు. ఇవన్నీ చూసే 2019 ఎన్నికల్లో ప్రజలు జగన్‌కు పట్టం కట్టారని స్పష్టం చేశారు. పవన్‌ వైఖరి అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లు ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details