Minister Botsa Satyanarayana: త్వరలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ ముఖ ఆధారిత హాజరు (ఈ-హాజరు) నమోదు విధానాన్ని ప్రభుత్వం తీసుకురానుందని.. ఇందులో భాగంగా మొదట విద్యాశాఖలో దీన్ని అమల్లోకి తెచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉపాధ్యాయులంతా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా సెల్‌ఫోన్ పాఠశాలకు తీసుకురాలేకపోయినా ఇతరుల ఫోన్లలో హాజరు వేయొచ్చని, సిగ్నల్స్ లేకపోయినా ఆఫ్‌లైన్‌లో హాజరు వేస్తే నెట్‌వర్క్ వచ్చిన తర్వాత సర్వర్‌లో నమోదు అవుతుందని హామీ ఇచ్చారు.
యాప్ ఆధారిత హాజరు నమోదుపై విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు గురువారం చర్చలు జరిపారు. అయితే ఇవి అసంపూర్తిగానే ముగిశాయి. సొంత ఫోన్‌లో యాప్ డౌన్‌లోడ్‌కు సిద్ధంగా లేమని, ప్రభుత్వమే డివైజ్‌లు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఉదయం 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా సెలవు పెట్టాలనే నిబంధన ఇబ్బందిగా ఉందని వెల్లడించారు. డివైజ్‌లు ఇవ్వలేమని, నిమిషం నిబంధన తొలగిస్తామని, ఈ-హాజరుపై 15 రోజులు శిక్షణ ఇస్తామని మంత్రి బొత్స హామీ ఇవ్వడంతో క్షేత్రస్థాయి ఉపాధ్యాయులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిర్ణయించారు. ప్రభుత్వమే డివైజ్‌లు కొని ఇవ్వాలంటే సుమారు రూ. 200 కోట్లు అవుతుందని మంత్రి బొత్స తెలిపారు. డివైజ్‌లు రెండేళ్లకే పాడవుతాయని, ప్రతి రెండేళ్లకు రూ. 200 కోట్లు ఖర్చు చేయడం సాధ్యం కాదని మంత్రి పేర్కొన్నారు. యాప్ హాజరులో ఏమైనా ఇబ్బందులు వస్తే 28వ తేదీ తర్వాత మరో సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ఈ-హాజరుపై ఎలాంటి ఒత్తిడి చేయబోమని వెల్లడించారు.