మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమన్నారు. తమ విధానానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అడ్డంకులు తొలగించుకుని అందరికీ ఆమోదయోగ్యంగా బిల్లు తెస్తామని తెలిపారు. రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సమీక్షలో మంత్రి బొత్స పాల్గొన్నారు. సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా అనే అంశంపై చర్చిస్తామన్నారు. రాజధాని అంటే కేవలం భూమి, అక్కడి సామాజిక వర్గమే కాదని అన్నారు. ఇతర ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఏదైనా సమాఖ్య వ్యవస్థకు లోబడి ఉండాలని బొత్స వెల్లడించారు.
రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికే ఉందని బొత్స స్పష్టం చేశారు. రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదేనని పార్లమెంట్‌లో చెప్పారని గుర్తు చేశారు. పార్లమెంటుకు విరుద్ధంగా ఇవాళ హైకోర్టు తీర్పు వచ్చిందని.., దీనిపై విస్తృత చర్చ జరగాలన్నారు. సీఆర్‌డీఏ చట్టాన్ని అమలు చేయాలని హైకోర్టు చెప్పిందని అన్నారు. సీఆర్‌డీఏ చట్టం అమలుకు తాము వ్యతిరేకం కాదని చెప్పారు. నిధులు, సమయం పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. ప్లాట్ల అభివృద్ధి 3 నెలల్లో సాధ్యమవుతుందా? అని ఆయన ప్రశ్నించారు. చట్టంలోని అంశాలను అమలు చేసేది లేదని తాము చెప్పట్లేదన్నారు. రాజధానిపై 5 కోట్ల ప్రజల అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. ఒక్క సామాజిక వర్గం కోరిక మేరకు రాజధాని ఉండదన్నారు. రైతులకు కావల్సిన రెండు అంశాలు నెరవేరుస్తామన్నారు.
రాజధాని భూములను ప్రభుత్వం ఎక్కడా తనఖా పెట్టలేదని మంత్రి బొత్స వెల్లడించారు. అమరావతి అభివృద్ధి కోసమే అక్కడి భూములను హడ్కోకు తాకట్టు పెట్టామన్నారు. రాజధాని భూములను చంద్రబాబు హయాంలోనే తనఖా పెట్టారని ఆరోపించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు పెడతామో లేదో మీరే చూస్తారని మీడియాతో అన్నారు.
"మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం. అధికార వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. అడ్డంకులు తొలగించుకుని అందరికీ ఆమోదయోగ్యంగా బిల్లు తెస్తాం. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా అనే అంశంపై చర్చిస్తాం. ప్లాట్ల అభివృద్ధి 3 నెలల్లో సాధ్యమవుతుందా?. ఏదైనా సమాఖ్య వ్యవస్థకు లోబడి ఉండాలి. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికే ఉంది. పార్లమెంటుకు విరుద్ధంగా తీర్పు వచ్చింది, దీనిపై విస్తృత చర్చ జరగాలి. సీఆర్‌డీఏ చట్టం అమలుకు మేం వ్యతిరేకం కాదు. చట్టంలోని అంశాలను అమలు చేసేది లేదని మేం చెప్పట్లేదు. రాజధానిపై 5 కోట్ల ప్రజల అభిప్రాయాలను తీసుకుంటాం. ఒక్క సామాజిక వర్గం కోరిక మేరకు రాజధాని ఉండదు.రాజధాని భూములను మేం ఎక్కడా తనఖా పెట్టలేదు. అమరావతి అభివృద్ధి కోసమే అక్కడి భూములను హడ్కోకు తాకట్టు. రాజధాని భూములను చంద్రబాబు హయాంలోనే తనఖా పెట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతామో లేదో మీరే చూస్తారు." -బొత్స సత్యనారాయణ, మంత్రి
హైకోర్టు తీర్పులో ఏముందంటే..
అమరావతిపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మాస్టర్ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లుగా 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 3 నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని సూచించింది. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని.. అలాంటప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు చేయడం కుదరదన్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని సూచించిందని న్యాయవాదులు తెలిపారు. అమరావతి కోసం సేకరించిన భూములను రాజధాని అవసరాలకే వినియోగించాలని ఆదేశించింది. పూలింగ్ భూములను ఇతర అవసరాలకు తనఖా పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
రిట్ ఆఫ్ మాండమస్ నిరంతరం కొనసాగుతుందని.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రిట్ ఆఫ్ మాండమస్ కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద 50 వేల రూపాయల చొప్పున చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. అంతేకాకుండా అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కార్యాలయాల తరలింపుపైనా మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికైనా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లకుండా ప్రజల ఆకాంక్షను గౌరవించాలని న్యాయవాదులు సూచించారు.
ఇదీ చదవండి
CM Jagan Review: ఇప్పుడేం చేద్దాం?.. హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ సమీక్ష