వచ్చే నెల నుంచి రాజధాని పనులు పునఃప్రారంభిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ రైతులకు చెప్పారు. అంతకు ముందు రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిపోయిన వివిధ భవనాలను మంత్రి బొత్స పరిశీలించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు రాజధానిలో బొత్స పర్యటన సాగింది.ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్) అధికారులు, గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగుల అపార్ట్‌మెంట్ టవర్లను, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాలను చూశారు. పునాది దశలోనే నిలిచిపోయిన సచివాలయం, హెచ్‌ఓడీ భవనాలు, హైకోర్టు భవనాల నిర్మాణ ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
నెల రోజుల్లో రాజధాని పనులు మెుదలుపెడతాం : మంత్రి బొత్స - రాజధానిపై మంత్రి బొత్స వ్యాక్యలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిన అభివృద్ధి పనులను నెల రోజుల్లో మొదలు పెడతామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని రైతులకు భరోసా ఇచ్చారు. మంత్రి బొత్స సత్యనారాయణను తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, వైకాపా నాయకులు, రైతులు కలిసి రాజధాని అభివృద్ధి విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిలో తను సోమవారం పర్యటించానన్నారు.

ఏఐఎస్ అధికారుల భవనాల్లో సిద్ధం చేసిన ‘మోడల్ ఫ్లాట్’ను బొత్స పరిశీలించారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం టవర్లు నిర్మిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి.. వాటి వివరాలు తెలుసుకున్నారు. వాటిని డయాగ్రిడ్ విధానంలో నిర్మించాలని తలపెట్టినట్టు అధికారులు చెప్పారు. డయాగ్రిడ్ అంటే ఏంటి? భవనం చుట్టూ అద్దాలు అమరిస్తే ఇబ్బంది ఉండదా? అని ప్రశ్నించినట్లు తెలిసింది. కరకట్ట రహదారి విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మరో రెండు, మూడు రోజుల్లో వివిధ రహదారుల పనుల్ని, ప్రాథమిక దశలో ఉన్న హ్యాపీనెస్ట్ పనుల్ని పరిశీలిస్తానని మంత్రి చెప్పినట్టు తెలిసింది. తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు మంత్రి నిరాకరించారు. తన పర్యటన గురించి చెప్పేందుకు ఏమీ లేదని, తమది చేతల ప్రభుత్వమే తప్ప మాటల ప్రభుత్వం కాదని బదులిచ్చారు.
ఇదీ చదవండి:'గల్వాన్ ఘర్షణ'లో మృతుల సంఖ్యపై నోరు విప్పిన చైనా