సీఎం జగన్ గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ సహనం కోల్పోతున్నారని విమర్శించారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని... అలాంటి వ్యాఖ్యలను సహించేది లేదన్నారు. అన్ని వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... అసహనంతో, అక్రోశంగా ఎందుకు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కార్మికుల పిల్లలు ఆంగ్ల విద్యను అభ్యసిస్తే పవన్‌కు కడపుమంట ఎందుకని ప్రశ్నించారు.
ఆంగ్లంపై పట్టు అవసరం...
ఆంగ్ల భాషపై పట్టు అవసరమని మంత్రి బొత్స వివరించారు. తాను కూడా ఆంగ్లంపై పట్టులేక వ్యక్తిగతంగా చాలా ఇబ్బందిపడుతున్నాని వ్యాఖ్యానించారు. మాతృభాషపై అందరికీ ప్రేమ ఉంటుందని... కానీ జీవన విధానంతో పరిస్థితులను మార్చుకోవాలన్నారు.
ఇసుకపై లేనిపోని ఆరోపణలు...
ఇసుక కొరతపై తెదేపా, జనసేన లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల వ్యవహారశైలి ఒకేలా ఉందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక పంపిణీ చేశామని తెదేపా నేతలు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఉచితంగా ఇసుక పంపిణీ చేసినట్లు నిరూపిస్తే... తల దించుకుంటానని సవాల్ విసిరారు. తెదేపా అధినేత చంద్రబాబు తలపెట్టిన ఇసుక దీక్ష... కొంగ దీక్ష అని ఎద్దేవా చేశారు. అంతా బాగా చేశామని చెబుతున్న తెదేపా నేతలు... మొన్నటి ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే ఎందుకు పరిమితమయ్యారని ప్రశ్నించారు.
మూడు పెళ్లిళ్లు వాస్తవమే కదా...
పవన్ మూడు పెళ్లిళ్ల గురించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు. పవన్ మూడు పెళ్లిళ్లు వాస్తవమే కదా అని అన్నారు. అది వ్యక్తిగతం కాదని అభిప్రాయపడ్డారు. ఆయన పిల్లలు ఎక్కడ చదువుతున్నారని... సీఎం అడిగింది వాస్తవమే కదా నిలదీశారు. ఈ అంశాన్ని వివాదాస్పదం చేయాల్సిన అవసరం లేదన్నారు.