రాజధానిలో గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ కొనసాగుతోందని.. త్వరలోనే వివరాలు బయట పెడతామనీ.. అమరావతి పట్టణమా, గ్రామమా అన్నది త్వరలోనే నోటిఫై చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రాజధానిలో భూసేకరణపై సీఎం జగన్ సమీక్ష జరిపారని, భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై చర్చించామని చెప్పారు. ఈనెల 28న అమరావతిలో చంద్రబాబు పర్యటనపై మంత్రి పలు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అమరావతి వచ్చి ఏం చూస్తారని.. నాలుగు భవనాలను 56 శాతం నుంచి 90 శాతం వరకు కట్టారని, అంతకు మించి అక్కడ ఏముందని ప్రశ్నించారు. నాలుగేళ్లలో 4900 కోట్ల ఖర్చు చేశారు కానీ రాజధానిలో ఏమీ లేదని విమర్శించారు. పనులు ఐదు శాతం పూర్తి అయ్యి 95 శాతం మిగిలి ఉంటే.. దాన్ని రాజధాని కట్టేయడం అంటారా అని ఎద్దేవా చేశారు. 28వ తేదీన చంద్రబాబు వస్తే రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు.
తెదేపా మాయలో పడొద్దు..
రాజధానిలో భూసేకరణపై సీఎం జగన్ సమీక్ష జరిపారని.. ఈ సమావేశంలో భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై చర్చించామని మంత్రి బొత్స తెలిపారు. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. తెదేపా మాయలో పడొద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.